TS New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
TS New Ration Cards : ఆరు గ్యారంటీల లబ్దిదారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 'ప్రజా పాలన' కార్యక్రమం లోగో, దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం కీలక ప్రకటన చేశారు.
TS New Ration Cards : ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన లోగో, దరఖాస్తు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆవిష్కరించారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
కొత్త రేషన్ కార్డుల జారీపై
కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అర్హులందరికీ త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. గ్రామసభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర దరఖాస్తుల ఫామ్ లను తీసుకుంటామన్నారు. ఆరు గ్యారంటీల లోగో, అప్లికేషన్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... గడీల మధ్య జరిగిన పాలనను గ్రామాలకు తీసుకువస్తున్నామన్నారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ కేటీఆర్‌ను కలిసినట్లు తెలిసిందని, బాధిత మహిళకు కేటీఆర్ రూ.1 లక్ష ఇచ్చారన్నారు. కేటీఆర్ దోచుకున్న రూ.లక్ష కోట్లలో బాధితురాలికి రూ.లక్ష ఇచ్చారు. దోచుకున్న సొమ్ము మొత్తం ప్రజలకు చేరేలా చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్న రేవంత్ రెడ్డి... ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారు.
రైతు బంధుపై ప్రకటన
రైతుబంధు పథకంపై పరిమితులు విధించబోతున్నామని జరుగుతున్న ప్రచారంలో వాస్తరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి లేదన్నారు. ఈ విషయంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన అనంతరం రైతు బంధుపై ప్రకటన చేస్తామన్నారు.
సీఎం బహిరంగ లేఖ
ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. "ప్రజా పాలనను కోరుకుని, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే, ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్ష వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజా పాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. ఈ మహత్తర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమయజ్ఞంలో భాగస్వాములువుతారని కోరుకుంటున్నాము" అని లేఖలో రేవంత్ రెడ్డి తెలిపారు.