500 Gas Cylinder : రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై ప్రభుత్వం కసరత్తు, అర్హుల ఎంపిక ఇలా!-hyderabad news in telugu 500 gas cylinder beneficiaries selection process with asha workers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  500 Gas Cylinder : రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై ప్రభుత్వం కసరత్తు, అర్హుల ఎంపిక ఇలా!

500 Gas Cylinder : రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై ప్రభుత్వం కసరత్తు, అర్హుల ఎంపిక ఇలా!

Bandaru Satyaprasad HT Telugu
Feb 07, 2024 09:12 PM IST

500 Gas Cylinder : 500 గ్యాస్ సిలిండర్ లబ్దిదారుల ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. క్షేత్రస్థాయిలో అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి అర్హుల వివరాలు పరిశీలించనున్నారు.

రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్
రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్

500 Gas Cylinder : తెలంగాణలో ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్...ఆ హామీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు, ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేబినెట్ భేటీలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయమని అధికారులను ఆదేశించింది.

రూ.500లకే గ్యాస్ సిలిండర్ లబ్దిదారుల ఎంపికపై

మహాలక్ష్మిపథకంలో రూ.500 గ్యాస్ సిలిండర్‌ లబ్దిదారులను ఎంపికకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రజా పాలనలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిని ఆశావర్కర్ల సాయంతో లబ్దిదారులను ఎంపిక చేయనుంది. ఆశా కార్యకర్తలు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి రేషన్ కార్డుతోపాటు ఇతర గుర్తింపు పత్రాలను పరిశీలిస్తారు. ఈ పథానికి అర్హులైనవారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటారు. అయితే తెల్లరేషన్ కార్డు కలిగి, గ్యాస్ కనెక్షన్‌ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనుందని సమాచారం. తెలంగాణలో సుమారు 90 లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఈ లెక్కన 64 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రస్తుతానికి రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కానున్నారు. మిగిలిన 26 లక్షల తెల్లరేషన్ కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేకపోవడం..వారికి ఈ పథకం వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 26 లక్షల మంది కొత్త గ్యాస్ కలెక్షన్ తీసుకుంటే ఈ పథకం వర్తించస్తుంది.

ప్రజాపాలన దరఖాస్తులతో అర్హుల ఎంపిక

ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పరిశీలించనున్నారు. వీరి పరిశీలన అనంతరం అర్హుల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌లో నమోదు చేయనున్నారు. ప్రతి కార్యకర్త 30 అప్లికేషన్లను పరిశీలించనున్నారు. రేషన్‌ కార్డు, ఎల్‌పీజీ కనెక్షన్ వివరాలు, పాస్‌బుక్‌ నెంబర్, డెలివరీ రసీదు నెంబర్ వివరాలను పరిశీలించనున్నారు. గ్రామాల్లో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు పూర్తి స్థాయి అవగాహన ఉండటంతో అర్హుల ఎంపిక ప్రక్రియను వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, మండలస్థాయిలో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, జిల్లాల్లో కలెక్టర్లు అర్హుల వివరాలు నమోదు చేసే యాప్‌ ను పర్యవేక్షించనున్నారు. రాష్ట్రస్థాయిలో రెవెన్యూ కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ అధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ పర్యవేక్షించనున్నారు. వీరి పరిశీలన అనంతరం రూ. 500లకే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని అమలు చేస్తారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ పై

అదే విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పై కేబినెట్ కీలకన నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుకు కసరత్తు చేస్తుంది. ఉచిత విద్యుత్ ను అద్దెకు ఉండే వారికి కూడా ఇవ్వనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అద్దెకు ఉండేవాళ్లకు వర్తించదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని నమ్మవద్దని విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉందన్నారు. మార్గదర్శకాలు విడుదలైన తర్వాత ఈ స్కీమ్ అమలుపై మరింత స్పష్టత వస్తుందన్నారు.

సంబంధిత కథనం