Meerpet Incident : మీర్ పేట్ గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు అరెస్ట్-hyderabad meerpet minor girl case police arrested six members searching for another ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Meerpet Incident : మీర్ పేట్ గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు అరెస్ట్

Meerpet Incident : మీర్ పేట్ గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు అరెస్ట్

Bandaru Satyaprasad HT Telugu
Aug 22, 2023 08:27 PM IST

Meerpet Incident : మీర్ పేట్ బాలికపై సామూహిత అత్యాచార ఘటనలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తు్న్నారు. ఈ ఘటనపై గవర్నర్ నివేదిక కోరారు.

మీర్ పేట్ కేసు
మీర్ పేట్ కేసు

Meerpet Incident : హైదరాబాద్ మీర్ పేట్ లో 16 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మంగళ్ హాట్ రౌడీషీటర్ అని గుర్తించామన్నారు. చిన్నా, మహేశ్, అష్రఫ్‌, తహిసీన్‌ అనే నలుగురు నిందితులు బాలికపై అత్యాచారం చేసిన తర్వాత ఫైజల్‌, ఇమ్రాన్‌ దగ్గరికి వెళ్లారు. వారి ఫోన్ తీసుకొని కాల్స్‌ చేసి నెంబర్లు డిలీట్‌ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఉమ్నాబాద్‌ వరకు వెళ్లిన నిందితులు పోలీసు బృందాలు గస్తీ చేయడం గమనించి తిరిగి వెనక్కి వచ్చేశారు. మొత్తం 12 బృందాలను రంగంలోకి దింపి నిందితులను వేరు వేరు చోట్ల పట్టుకున్నామని సీపీ చౌహాన్‌ తెలిపారు.

అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌ లాల్‌బజార్‌కు ప్రాంతానికి చెందిన 16ఏళ్ల బాలిక తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోయారు. తమ్ముడితో కలిసి మీర్‌పేటలోని ఓ కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క వరుసయ్యే మహిళ దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాధిత బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఆమె తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పని చేస్తుంటాడు. సోమవారం ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు, మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎనిమిది మంది యువకులు వారి ఇంట్లోకి చొరబడ్డారు. గంజాయి మత్తులో ఉన్న నిందితులు బాలిక మెడపై కత్తి పెట్టి బెదిరించి భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలినవారు బాలిక తమ్ముడితో పాటు అక్కడే ఉన్న చిన్నారుల్ని బయటకు వెళ్లకుండా బెదిరించారు. బాలికను తీసుకెళ్లిన వారిలో ముగ్గురు ఆమెను కత్తితో బెదిరించి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారైనట్లు బాలిక బంధువులు తెలిపారు. విషయం తెలిసిన బాధితురాలి సోదరి మీర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత బాలికకు వైద్య పరీక్షల అనంతరం సఖి కేంద్రానికి తరలించారు.

48 గంటల్లో నివేదిక ఇవ్వండి-గవర్నర్

మీర్‌పేట బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్పందించారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని, పోలీసులను అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమీషనర్ ను గవర్నర్ ఆదేశించారు. బాధితురాలి ఇంటిని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు సందర్శించి ఆమె కుటుంబానికి సాయం అందించాలని ఆదేశించారు.

Whats_app_banner