HMDA Lands Auction : కోట్లు కురిపించిన కోకాపేట, బుద్వేల్ భూములు-హెచ్ఎండీఏకు రూ.6 వేల కోట్ల ఆదాయం-hyderabad kokapet budvel land auction hmda received 6k crores profit ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hmda Lands Auction : కోట్లు కురిపించిన కోకాపేట, బుద్వేల్ భూములు-హెచ్ఎండీఏకు రూ.6 వేల కోట్ల ఆదాయం

HMDA Lands Auction : కోట్లు కురిపించిన కోకాపేట, బుద్వేల్ భూములు-హెచ్ఎండీఏకు రూ.6 వేల కోట్ల ఆదాయం

HT Telugu Desk HT Telugu
Sep 27, 2023 09:03 PM IST

HMDA Lands Auction : కోకాపేట, బుద్వేల్ భూముల వేలం హెచ్ఎండీఏకు సిరులు కురిపించాయి. రూ.300 కోట్లతో భూములను అభివృద్ధి చేస్తూ రూ.6000 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

హెచ్ఎండీఏ భూముల వేలం
హెచ్ఎండీఏ భూముల వేలం

HMDA Lands Auction : ఇటీవలే కోకాపేట, బుద్వేల్ లో ఎకరం భూమి విలువ రూ.100 కోట్లకు పైగా పలికి రికార్డు సృష్టించింది. కోకాపేట, బుద్వేల్ భూముల వేలం ద్వారా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కు (HMDA)కు రూ.6000 కోట్ల ఆదాయం లభించింది. కోకాపేట్, బుద్వేల్ రెండింటిలోనూ బిడ్డర్లు నిర్ణీత చెల్లింపు షెడ్యూల్‌కు అనుగుణంగా తమ చెల్లింపులను వెంటనే పూర్తి చేశారని హెచ్ఎండీఏ వెల్లడించింది. కోకాపేట్‌లో ఆగస్టు 3న మొత్తం 45.33 ఎకరాల్లో 7 ప్లాట్లు (ఒక్కో ప్లాట్ 3 ఎకరాల నుంచి 9 ఎకరాల మధ్య ఉన్నాయి) ఈ-వేలం వేయగా... రూ. 3,319.60 కోట్ల ఆదాయం వచ్చింది. సగటున ఒక్కో ఎకరానికి రూ.73.23 కోట్లు పలికినట్లు హెచ్ఎండీఏ పేర్కొంది. అత్యధికంగా ఒక ఎకరానికి రూ.100 కోట్లు పలికి రికార్డు సృష్టించగా... అతి తక్కువ ధరే రూ.51.75 కోట్లు పలకడం విశేషం. అదేవిధంగా బుద్వేల్‌లో హెచ్ఎండీఏ ఆగష్టు 10న 100.01 ఎకరాలను వేలానికి పెట్టగా రూ. 3625.73 కోట్ల ఆదాయం వచ్చింది. సగటున ఒక్కో ఎకరాకు రూ.36.25 కోట్లు వచ్చాయి. ఈ ప్రాంతంలో అత్యధిక బిడ్ ఎకరాకు రూ. 41.75 కోట్లు.

హెచ్ఎండీఏ పెట్టిన ఖర్చు రూ.300 కోట్లు

కోకాపేటలో లేఅవుట్‌ అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ సుమారు రూ. 300 కోట్లు వెచ్చించి. అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పించింది. సుమారు 41 ఎకరాలను రకరకాల వసతుల కోసమే కేటాయించారు. లేఅవుట్‌లోని రోడ్లన్నీ 45 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల రహదారి, 36 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు.

ప్రభుత్వ ధర రూ.35 కోట్లు

కోకాపేటలోని నియోపోలిస్ ఫేజ్- 2 హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో భూముల వేలాన్ని ఆగస్టు 3న నిర్వహించారు. 45.33 ఎకరాల్లోని ఏడు ప్లాట్లను హెచ్‌ఎండీ వేలం వేసింది. ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ-వేలం కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ ధర ఒక ఎకరానికి రూ.35 కోట్లుగా నిర్ణయించారు.

రూ.100 కోట్లు దాటిన పదో నెంబరు ప్లాటు

ఆగస్టు 3న కోకాపేటలోని నియో పోలీస్ ఫేస్ లోని 10, 11, 14 నెంబరు ప్లాట్ల వేలం జరిగింది. ఈ మూడు ప్లాట్ల విస్తీర్ణం 18.47 ఎకరాలు. వీటిలో 10వ నెంబరు ప్లాటు రికార్డు ధర పలికి.. ఎకరం రూ.100.75 కోట్ల ధర పలికింది. 3.6 ఎకరాల్లో ఈ పదో నెంబరు ప్లాటు ఉంది. ఈ ఒక్క పదో నెంబరు ప్లాటు వల్లనే రూ.360 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో హెచ్ఎండీఏకు 2 వేల కోట్ల ఆదాయం

హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌లో ప్లాట్లను 2021లో మొదటి ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను వేలం వేశారు. అప్పట్లో ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు. ఇందులో ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది. 2/పీ వెస్ట్‌ పార్ట్‌ గల ప్లాట్‌ను రాజపుష్ప ప్రాపర్టీస్‌ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతం చేసుకుంది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు అప్పుడు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరింది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner