JEE Advanced Copying : జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్- వాట్సాప్ లో స్నేహితులకు సమాధానాలు, కడప విద్యార్థి అరెస్ట్
JEE Advanced Copying : ఐఐటీ జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ చేశాడో విద్యార్థి. తాను రాసిన సమాధానాలను వాట్సాప్ ద్వారా స్నేహితులకు పంపించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
JEE Advanced Copying :ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్ ఎగ్జామ్ లో స్మార్ట్ కాపీయింగ్ సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఏపీకి చెందిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌లోని ఓ ఎగ్జామ్ సెంటర్ లో చింతపల్లి చైతన్య కృష్ణ అనే విద్యార్థి తాను రాసిన జవాబులు వాట్సాప్ ద్వారా తన స్నేహితులకు పంపించాడు. వారంతా వివిధ పరీక్షా కేంద్రాల్లో జేఈఈ పరీక్ష రాస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరిగింది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణలో సుమారు 35 వేల మంది హాజరయ్యారు.
జేఈఈ పరీక్షలో మాస్ కాపీయింగ్
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం మరువక ముందే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఓ విద్యార్థిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేఈఈ పరీక్షలో నలుగురు విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో స్మార్ట్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఈ స్మార్ట్ కాపీయింగ్‌లో కడప జిల్లాకు చెందిన చైతన్య అనే విద్యార్థి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇతడు పదో తరగతి, ఇంటర్ లో టాపర్ గా నిలిచాడు. అయితే తన స్నేహితులకు మంచి మార్కులు వచ్చేలా తాను రాసిన సమాధానాలను వాట్సాప్ ద్వారా స్నేహితులకు పంపించాడు. సికింద్రాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రం చైతన్య అతడు ఈ కాపీయింగ్ చేశాడు. హైదరాబాద్ లోని ఓ కళాశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో మంచి మార్కులు సాధించాలని కాపీయింగ్ ప్లాన్ వేశారు.
కడప విద్యార్థి అరెస్ట్
సికింద్రాబాద్ లో పరీక్ష రాస్తున్న కడప విద్యార్థిపై అబ్జర్వర్‌కు డౌట్ రావడంతో... అతడిని తనిఖీ చేయగా స్మార్ట్ ఫోన్ దొరికింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు చైతన్యను దిల్‌సుఖ్ నగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. జేఈఈ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు స్మార్ట్ ఫోన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ పరీక్ష కేంద్రంలోకి ఎలా తెచ్చారు. నిందితులకు పరీక్షా కేంద్రాల్లో ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వీళ్లతో పాటు ఇంకెవరైనా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించి పరీక్ష రాశారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న పిన్నును కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించని అధికారుల కళ్లు గప్పి స్మార్ లోపలికి ఎలా తీసుకెళ్లారని నిందితులను విచారిస్తున్నారు.