Governor Tamilisai : అర్హత లేని అభ్యర్థులను నామినేట్ చేయడం తగదు, ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించిన గవర్నర్-hyderabad governor tamilisai rejected brs govt nominated quota mlc names ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Hyderabad Governor Tamilisai Rejected Brs Govt Nominated Quota Mlc Names

Governor Tamilisai : అర్హత లేని అభ్యర్థులను నామినేట్ చేయడం తగదు, ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించిన గవర్నర్

Bandaru Satyaprasad HT Telugu
Sep 25, 2023 05:26 PM IST

Governor Tamilisai : తెలంగాణ గవర్నర్, ప్రభుత్వానికి మధ్య మరో వివాదం తలెత్తింది. ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తమిళి సై తిరస్కరించారు. తగిన అర్హతలు లేనికారణంగా వారి పేర్లను తిరస్కరించినట్లు తెలిపారు.

గవర్నర్ తమిళి సై
గవర్నర్ తమిళి సై

Governor Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళి సై సంచలన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ పేర్లను కేబినెట్ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కేబినెట్ సిఫార్సు చేసిన అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని గవర్నర్‌ పేర్కొన్నారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని ఆమె అన్నారు. నామినేటెడ్ కోటాకు తగిన అర్హతలు లేని అభ్యర్థులను నామినేట్ చేయడం తగదన్నారు. తగిన అర్హతలు ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారన్నారు. అర్హుల పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ కారణాలతో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను సిఫార్సు చేయడం సరైంది కాదన్నారు. ఇలా చేయడంతో ఆయా రంగాల్లో పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించనట్లే అన్నారు. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎవరిని ఎంపిక చేయాలో ప్రజాప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. మంత్రి మండలి సిఫార్సులో ఈ విషయాలను స్పష్టం చేయలేదని గవర్నర్‌ తమిళి సై వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు తిరస్కరించాలని గవర్నర్‌ సీఎం, మంత్రి వర్గానికి సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్

తెలంగాణలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం కొనసాగుతోంది. పాడి కౌశిక్ ఎమ్మెల్సీ సిఫార్సు, ఆర్టీసీ బిల్లు పెండింగ్, ప్రోటోకాల్ వివాదం...గత నాలుగేళ్లుగా గవర్నర్ తమిళి సై , బీఆర్ఎస్ ప్రభుత్వం వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ రిజెక్ట్ చేయడంపై మరోసారి వివాదం నెలకొంది. ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా పెండింగ్ పెట్టడం, వివరణ కోరడం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ తీరుపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శలు చేశారు. సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం గవర్నర్‌గా తమిళిసై అనర్హులు అన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు ఎలా గవర్నర్ అయ్యారని మండిపడ్డారు. సామాజిక సేవను రాజకీయాల్లో ఒక భాగంగానే చూడాలన్నారు. కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీల హోదాకు అర్హులే అన్నారు.

దాసోజు శ్రవణ్ అసంతృప్తి

గవర్నర్ తమిళిసై సౌందరాజన్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ కోటాలో మంత్రి వర్గం సిఫార్సు చేసిన అభ్యర్థులను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక సేవ రాజకీయాలు విభిన్నమైన పాత్రలు, ప్రయోజనాలను కలిగి ఉంటాయన్నారు. కానీ అవి రెండూ ఒకటేనన్నారు. రాజకీయ నాయకులు చట్టం ద్వారా సామాజిక సమస్యలను పరిష్కరించడానికి పని చేయవచ్చన్నారు. సామాజిక సమస్యలను పరిష్కరించేటప్పుడు సామాజిక మెరుగుదల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రెండు రంగాలు తరుచుగా కలుస్తాయని దాసోజు శ్రవణ్ తెలిపారు.

WhatsApp channel
తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.