Hyderabad Begging Mafia : హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా, బిచ్చగాళ్ల ఆదాయం నెలకు రూ.2 లక్షలు!
Hyderabad Begging Mafia : హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియాను పట్టుకున్నారు పోలీసులు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి పిల్లలు, వృద్ధులతో బిక్షాటన చేయిస్తున్నాడు. ఈ కేసులో షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి.
Hyderabad Begging Mafia : హైదరాబాద్ లో రెండ్రోజుల క్రితం బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ కేసులో కర్ణాటకకు చెందిన అజిత్ పవార్ అనే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పవార్ వృద్ధులు, పిల్లలకు.. రోజుకు రూ.200 చెల్లించి బెగ్గింగ్ కు పంపించేవాడని పోలీసులు విచారణలో తేలింది. ఇతని వద్ద ఎనిమిది పిల్లతో సహా 23 మంది యాచకులు ఉన్నారు. ఈ బిచ్చగాళ్లను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, నగరంలోని ఇతర రద్దీ ప్రదేశాలలో భిక్షాటనకు పెట్టేవాడు పవార్. యాచకులు ఒక్కొక్కరూ రోజుకు రూ.4,500 నుంచి 6,000 సంపాదించినా, పవార్ వారికి కేవలం రూ.200 మాత్రమే ఇచ్చేవాడు. బిచ్చగాళ్లు ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై విచారించిన పోలీసులు బెగ్గింగ్ మాఫియాను ఛేదించారు. కర్ణాటక గుల్బర్గాకు చెందిన అజిత్ పవార్ (28) అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి ఎనిమిది వాహనాలను సీజ్ చేశారు. కర్ణాటకలో అతడికి రెండు ఇళ్లు ఉన్నాయని, చిట్ ఫండ్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది.
నెలకు రూ.2 లక్షల సంపాదన
బెగ్గింగ్ మాఫియా కేసులో పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. హైదరాబాద్ లోని పలు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద భిక్షాటన చేసే కొంతమంది నెల ఆదాయం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉందని తెలిసింది. బెగ్గింగ్ మాఫియా కేసులో బాధితులతో పోలీసులు మాట్లాడినప్పుడు ఈ విషయం బయటపడింది. కొన్ని కుటుంబాలు హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాహనదారుల వద్ద భిక్షాటన చేస్తుంటారు. భార్య, భర్త, వారి పిల్లలు, వృద్ధులతో సహా కుటుంబం మొత్తం ఇదే వృత్తిలో ఉంటారు. మొత్తం కుటుంబం ఒక ట్రాఫిక్ జంక్షన్‌ను లక్ష్యంగా చేసుకుని బిక్షాటన చేస్తుంటుంది. అక్కడ ఇతర బిచ్చగాళ్లను అనుమతించరు. ఈ కుటుంబం రోజుకు రూ.4,500 నుంచి రూ. 6,000 వరకు సంపాదిస్తున్నారని టాస్క్ ఫోర్స్ అధికారి ఒకరు తెలిపారు.
ట్రాఫిక్ జంక్షన్ల వద్ద
నగరంలోని రద్దీ ప్రాంతాలు, ప్యారడైజ్, జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, మాసబ్ ట్యాంక్, అబిడ్స్, ట్యాంక్ బండ్, కోఠి, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం ఈ ప్రాంతాల్లోని ట్రాఫిక్ జంక్షన్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ ప్రాంతాలను బిచ్చగాళ్లు విభజించుకుని బిచ్చం ఎత్తుకుంటారు. ఒకరి ఏరియాలోకి మరొకరు వస్తే ఈ గ్యాంగ్ లో పెద్దలు జోక్యం చేసుకుంటారు. ఈ బిచ్చగాళ్లు టైం స్లాట్ ప్రకారం బిక్షాటన చేస్తారని పోలీసులు గుర్తించారు. కుటుంబం మొత్తం ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఉదయం 10 గంటల నుంచి బిక్షాటన చేస్తుంటారు. కొన్ని కుటుంబాలు రుణాలు కూడా ఇస్తుంటాయని తెలుస్తోంది. దీంతో మంచి ఆదాయం వస్తుందని భావించి కొందరు.. పిల్లలు, వృద్ధులకు రోజు వారీ కూలీ ఇచ్చి బిక్షాటన చేయిస్తున్నారు. ఈ తరహా బెగ్గింగ్ మాఫియాను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు.