Sub Registrar Taslima : కోట్లలో కూడబెట్టిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా, ఏసీబీ సోదాలతో వెలుగులోకి ఆస్తుల చిట్టా!
Sub Registrar Taslima : మొన్నటి వరకూ సేవా కార్యక్రమాలు, సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సబ్ రిజిస్ట్రాన్ తస్లిమా...అవినీతి చిట్టా బయటపడింది. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తస్లిమా.. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో బయటపడింది. ఆమెకు సుమారు రూ.3 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ నిర్థారించింది.
Sub Registrar Taslima : సేవా కార్యక్రమాలు, వ్యవసాయ పనులు, బైక్ సెల్ఫ్ రైడింగ్‌లతో సోషల్ మీడియా(Social Media)లో ట్రెండింగ్లో ఉండే సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్(Sub Registrar Taslima) ప్లాట్రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి(ACB) చిక్కిన విషయం తెలిసిందే. మహబూబాబాద్ సబ్‌రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ఆమె మార్చి 22న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. సరిగా నెల రోజులకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెతో పాటు ఆమె బంధువుల ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోమవారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ కాలనీ, న్యూరాయపురలోని తస్లీమాతో పాటు ఆమె అన్నదమ్ములకు చెందిన ఐదు ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. అంతేగాకుండా సూర్యాపేట(Suryapet)లోని ఆమె భర్త, మరికొందరు అనుమానితుల ఇండ్లలోనూ సోదాలు చేశారు. తనిఖీల్లో భాగంగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించి, పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.
కోట్ల విలువైన ఇళ్లు, భూములు
సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్(Taslima Mohammed) తన కుటుంబ సభ్యుల పేరున ఆస్తులు కూడబెట్టినట్టు అవినీతి నిరోధక శాఖ (ACB)అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా హనుమకొండ కాకతీయ కాలనీలో 2 కోట్ల 7 లక్షల 456 రూపాయల విలువైన ఐదు ఇళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. అంతేగాకుండా 12 లక్షల విలువైన ఆరు ఓపెన్ ప్లాట్లు, రూ.20 లక్షల 40 వేల విలువైన మూడు ఎకరాల భూమి కలిగి ఉన్నట్లు తేల్చారు. లక్షా 92 వేల నగదు, రూ.98,787 బ్యాంక్ బ్యాలెన్స్, రూ.23 లక్షల 66 వేల విలువైన వాహనాలు తస్లీమా సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అధికారులు వేసిన లెక్కల ప్రభుత్వ విలువ ప్రకారం రూ.2 కోట్ల 94 లక్షల 84 వేల 547 విలువైన ఆదాయానికి మించిన ఆస్తులు తస్లీమా కలిగి ఉన్నట్లు ఏసీబీ ఆఫీసర్లు నిర్థారణకు వచ్చారు. మార్కెట్ లెక్కల ప్రకారం మొత్తం ఆస్తులు విలువ రూ.30 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వివిధ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకున్నామని, వరంగల్ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు తరువాత చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య వివరించారు.
రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్.. ప్రస్తుతం కరీంనగర్ జైలులో..
మహబూబాబాద్(Mahabubabad) జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీశ్ 128 గజాల స్థలానికి రిజిస్ట్రేషన్ కోసం మార్చి మొదటి వారంలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్(Sub Registrar Taslima Mohammed)ను సంప్రదించాడు. ఆమె సూచన మేరకు ఆఫీస్‌లో పనిచేసే ఔట్ సోర్సింగ్ఉద్యోగి ఆలేటి వెంకటేశ్‌ను సంప్రదించగా.. ప్రభుత్వ ధర ప్రకారం గజానికి రూ.100 ఉంటుందని, కానీ ఇక్కడ మాత్రం గజానికి రూ.150 చొప్పున ఇస్తేనే రిజిస్ట్రేషన్(Registration) చేస్తామని ఆయన చెప్పాడు. దీంతో హరీశ్వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్యను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల ముందస్తు ప్లాన్ ప్రకారం హరీశ్ గత నెల 22న కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమాకు డబ్బులు ఇవ్వబోయాడు. కానీ ఆఫీస్‌లో పనిచేసే వెంకటేశ్‌కు ఇవ్వాలని ఆమె సూచించడంతో బాధితుడు హరీశ్ రూ.19,200ను వెంకటేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకటేశ్ వద్ద రూ.19,200 తోపాటు అదనంగా ఎలాంటి లెక్కలు లేని మరో 1.72 లక్షలు లభించాయి. దీంతో తస్లీమాపై ఏసీబీ(ACB) అధికారులు కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం ఆమె కరీంనగర్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వ్యవహారంలో ఏసీబీ అదికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం