Mahabubabad Crime : మహబూబాబాద్ లో విషాదం, పిల్లల్ని చంపిన పేరెంట్స్ ఉరేసుకుని ఆత్మహత్య
: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఇద్దరు పిల్లలకు పాలలో విషం ఇచ్చి పరారైన తల్లిదండ్రులు సమీప అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజుల క్రితం ఈ ఘటన జరగగా... వారి మృతదేహాలు ఇప్పుడు లభ్యమయ్యాయి.
Mahabubabad Crime : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో గత నెల పాలలో విషమిచ్చి ఇద్దరు చిన్నారులను హతమార్చి.. పరారైన పేరెంట్స్ ఘటన విషాదాంతమైంది. ముక్కుపచ్చలారని ఇద్దరు కూతుళ్లకు పాలలో విషం కలిపి ఇచ్చి చంపి పరారైన తల్లిదండ్రులు అనిల్, దేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పిల్లలు చనిపోయిన రోజు నుంచి వాళ్లిందరూ కనిపించకుండా పోగా.. మహబూబాబాద్ జిల్లా నామాలపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెప్పులు, దుస్తుల ఆధారంగా మృతదేహాలను గుర్తించారు. ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నారులను చంపి, తల్లిదండ్రులు సూసైడ్ చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్(Mahabubabad) జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి అంకన్నగూడెం గ్రామానికి చెందిన పెండకట్ల అనిల్ బయ్యారం మండలం నామాలపాడులోని రాయికుంటకు చెందిన దేవిని దాదాపు ఐదేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వ్యవసాయంతో పాటు ఇటుక బట్టీల్లో పని చేసే అనిల్ తన అత్తగారి గ్రామమైన రాయకుంటలోనే కొద్దిరోజులుగా నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. వారి దాంపత్య జీవితానికి లోహిత(3), జశ్విత(1) అనే ఇద్దరు చిన్నారులు పుట్టారు. ఇదిలాఉంటే అనిల్-దేవీ దంపతులు తమ ఇద్దరు చిన్నారులను తీసుకొని మార్చి 9వ తేదీ సాయంత్రం రాయికుంట నుంచి అంకన్నగూడెం వచ్చారు.
పాలల్లో విషం కలిపి
అనిల్ తండ్రి వెంకన్న అంకన్న గూడెంలో చిన్నపాటి కిరాణం షాప్ నడిపిస్తుంటాడు. వెంకన్న రోజువారీలాగే దుకాణం తీసేందుకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కొడుకు అనిల్, కోడలు దేవి కనిపించలేదు. దీంతో వారి కోసం వెతుకుతుండగానే లోహిత, జశ్విత ఇద్దరూ విగతాజీవులుగా కనిపించారు. అది చూసి కంగు తిన్న వెంకన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంకన్న నుంచి సమాచారం అందుకున్న మహబూబాబాద్(Mahabubabad) డీఎస్పీ తిరుపతి రావు, సీఐ రవి కుమార్, ఎస్సై జీనత్ కుమార్ హుటాహుటిన అంకన్న గూడెం చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, వెంకన్న ను విచారించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇంట్లో పరిశీలించగా మంచంపై పాల సీసా కనిపించగా, దాన్ని సేకరించారు. గదిలో ఓ చోట చిరిగి ఉన్న పాల ప్యాకెట్ తో పాటు అనిల్ దేవిల దుస్తుల బ్యాగ్ లో పురుగుల మందు డబ్బాను గుర్తించారు. దీంతో పాలల్లో విషం(Milk Poison) కలిపి చిన్నారులను హతమర్చారనే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
నామాలపాడు అటవీ ప్రాంతంలో ఆత్మహత్య
మార్చి 10న చిన్నారులకు పాలల్లో విషం కలిపి, వారిని పడుకోబెట్టిన అనిల్, దేవి దంపతులు ఇద్దరూ అదే రోజు నామాలపాడు అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి అటవీ ప్రాంతంలో ఇద్దరూ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. కాగా మార్చి 10న ఈ ఘటన జరగగా.. పిల్లలను చంపి, అనిల్, దేవి ఎక్కడికైనా పారిపోయి ఉండవచ్చని అందరూ భావించారు. కానీ నామాలపాడు అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న డెడ్ బాడీని గమనించిన కొంతమంది స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. నెల రోజులు దాటి పోవడంతో మృతదేహాలు కుళ్లిపోగా.. దుస్తులు, చెప్పుల ఆధారంగా డెడ్ బాడీలను చూసి అనిల్, దేవిగా గుర్తించారు.
విచారణ జరుపుతున్న పోలీసులు
ఇద్దరు కూతుళ్లను చంపి, అనిల్, దేవి ఆత్మహత్య(Suicide) చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందనే స్థానికంగా చర్చ నడుస్తోంది. ఆర్థిక సమస్యలా.. లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. కుటుంబ సభ్యులతో గొడవలు, ఆర్థిక పరమైన అంశాలపైనా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అనిల్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న గార్ల పోలీసులు అధికారులు.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వివరించారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం