Nirmal Crime : బావ లేని జీవితం నాకొద్దు, అందుకే వెళ్లిపోతున్నా- బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్-nirmal crime news in telugu basar iiit student committees suicide loved brother in law died ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nirmal Crime : బావ లేని జీవితం నాకొద్దు, అందుకే వెళ్లిపోతున్నా- బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్

Nirmal Crime : బావ లేని జీవితం నాకొద్దు, అందుకే వెళ్లిపోతున్నా- బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్

HT Telugu Desk HT Telugu
Feb 23, 2024 09:25 PM IST

Nirmal Crime : బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాను ప్రాణంగా ప్రేమించిన బావ మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లేఖలో రాసింది.

విద్యార్థిని సూసైడ్
విద్యార్థిని సూసైడ్

Nirmal Crime : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా(Nirmal) బాసర ట్రిపుల్ ఐటీ(Basar IIIT)లో చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తాను ప్రాణంగా ప్రేమించిన బావ మరణాన్ని తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ లేఖ(Suicide Letter) రాసింది. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన నర్సింలు, రుక్మిణిలకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నర్సింలు కుమార్తె బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతుంది. గురువారం సాయంత్రం విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అది గమనించిన సిబ్బంది హెల్త్ సెంటర్ కు తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. వెంటనే ట్రిపుల్ ఐటీ అధికారులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బావ లేకుండా ఉండలేకపోతున్నానని

విద్యార్థిని సూసైడ్ నోట్ లో తను ప్రాణంగా ప్రేమించిన సొంత బావ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. బావ లేకుండా నేను ఉండలేకపోతున్నానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసింది. బావ లేని జీవితం నాకొద్దు. అందుకే బావ దగ్గరికి వెళ్లిపోతున్నా. బావ చావుకి కారణమైన వారిని వదలకండి. నా శవాన్ని బావని కాల్చిన దగ్గరే కాల్చండి..ఇదే నా చివరి కోరిక.. ప్లీజ్ నాన్న. ఇప్పటి నుంచి మీకు కూతురులేదు కొడుకు ఒక్కడే. తమ్ముణ్ని, అమ్మని జాగ్రత్తగా చూసుకో నాన్న అని లేఖలో రాసింది. బాలిక మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో చోటుచేసుకుంది. పెద్దారెడ్డిపేటకు చెందిన పండరికి, అందోల్ మండలం రాంసానిపల్లికి చెందిన పెద్దగొల్ల పుష్పలత (35) కు 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా భర్త రెండు సంవత్సరాల కింద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో పుష్పలత ఇద్దరు కుమారులతో కలిసి అత్త వద్ద ఉంటూ, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తన కొడుకులు ఇంట్లో లేకపోవడంతో పుష్పలత అర్ధరాత్రి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా గురువారం పొద్దున్నే నిద్రలేసిన తర్వాత అత్త లోపలికి వెళ్లి చూడగా కోడలు విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో బోరున విలపించింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని వారు వివరించారు.

హెచ్.టి.తెలుగు రిపోర్టర్, నిర్మల్

Whats_app_banner