Etela Rajender : రెండు చోట్ల పోటీ చేస్తా - ఈటల రాజేందర్ సంచలన ప్రకటన
Telangana Assembly Elections: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
BJP MLA Eatala Rajender News: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోటీ చేయటంతో పాటు…. హుజూరాబాద్ లో కూడా పోటీలో ఉంటానని చెప్పారు. హుజురాబాద్‌లో కార్యకర్తలే కథానాయకులు అవ్వాలని పిలుపునిచ్చారు.
ఇవాళ హుజూరాబాద్‌లో పర్యటించిన ఈటల…. పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ సర్కార్ ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. హుుజరాబాద్ నియోజకవర్గంతో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్ లో కూడా పోటీ చేస్తానంటూ సంచలన ప్రకటించారు. గత ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకున్నారని చెప్పారు. తనకు పరిచయం లేని వాళ్లు కూడా తన కోసం పని చేశారని గుర్తు చేశారు. సర్కార్ పెట్టే అక్రమ కేసులకు భయపడవద్దని… గతంలో ఉద్యమంలో అనేక కేసుల్లో జైలుకు వెళ్లానని అన్నారు. తనను గెలవనియ్యవద్దని కొందురు అనుకుంటున్నారని… కానీ ఆ విషయాన్నిప్రజలు అనుకుంటేనే అవుతుందని వ్యాఖ్యానించారు.
గత కొంతకాలంగా ఈటల రాజేందర్ పోటీ చేసే స్థానంపై జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి హుజురాబాద్ లో ఆయన కాకుండా… సతీమణి జమునా రెడ్డి పోటీ చేస్తారనే చర్చ జరిగింది. ఇక ఈటల గజ్వేల్ లేదా మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావించారు. అయితే ఈ వార్తలన్నింటికి చెక్ పెడుతూ… ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తానని….తేల్చి చెప్పారు. గతంలో ప్రకటన చేసిన మాదిరిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా బరిలో ఉంటానని చెప్పటం సంచలనంగా మారింది.
ఇక ఈటల రాజేందర్ నిర్ణయంపై బీజేపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రెండు చోట్ల పోటీ చేసేందుకు అనుమతి ఇస్తారా…? లేక ఏదైనా ఒక చోట మాత్రమే చేయాలని సూచిస్తారా అనేది చూడాలి.