Attacks on Temples : పోలీసులు మా నేతల ఇళ్లల్లో చొరబడి.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు : ఈటల-etela rajender condemned the series of attacks on temples ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Attacks On Temples : పోలీసులు మా నేతల ఇళ్లల్లో చొరబడి.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు : ఈటల

Attacks on Temples : పోలీసులు మా నేతల ఇళ్లల్లో చొరబడి.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు : ఈటల

Basani Shiva Kumar HT Telugu
Oct 22, 2024 05:16 PM IST

Attacks on Temples : దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. బాధ్యులు ఎవరనేది పోలీసులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమ నేతల ఇళ్లల్లో చొరబడి.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మతకలహాలు సృష్టిస్తోందన్నారు.

ఈటల రాజేందర్
ఈటల రాజేందర్

హిందూ ప్రజల పట్ల, సంస్థల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వేషభావనతో ఉన్నారని.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీది ఒకటే కల్చర్ అని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మత విద్వేషాలు సృష్టించే వారిని ఏనాడు నియంత్రించలేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మతోన్మాదులకు షెల్టర్ ఇస్తూ.. వారిని పెంచి పోషిస్తున్నా నియంత్రించే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్యానించారు.

'హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడిన విషయంలో.. ప్రశ్నిస్తున్న వారిని సంఘ విద్రోహశక్తులుగా, మతోన్మాదులుగా, దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చాలన్నా కూడా మత కలహాలు సృష్టించిన పార్టీ కాంగ్రెస్' అని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.

'1978లో రమీజా బీ హత్య కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో హైదరాబాద్ నగరంలో మత కలహాలు చెలరేగాయి. హైదరాబాద్‌లో మంటలు రేగి, అల్లర్లు జరిగాయి. వందల మంది ప్రాణాలు పోయాయి. 1982-83 కాలంలోనూ కాంగ్రెస్ పార్టీ మత కలహాలు సృష్టించి.. వందల మందిని బలిపెట్టింది. వారి శవాలమీద రాజకీయం చేసింది' అని రాజేందర్ ఆరోపించారు.

'2014కు ముందు ప్రపంచ వ్యాప్తంగా సిరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్.. ఇలా అనేక చోట్ల టెర్రరిస్టులు జిహాదీల పేరిట రక్తాన్ని ఏరులుగా పారించారు. జమ్ము కశ్మీర్ లో భారత సైనికుల మీద రాళ్ల వర్షం కురిసినప్పుడు, సైన్యం ట్రక్కుల మీద బాంబులు పేలినప్పుడు ఆ మారణహోమాన్ని చూసి ప్రజలు ఏడ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చాలాచోట్ల ఉన్మాదంతో.. జిహాదీ పేరుతో బాంబు దాడులకు పాల్పడిన ఘటనలు చాలా ఉన్నాయి' అని ఈటల వ్యాఖ్యానించారు.

'పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో.. మత కలహాలతో జరిగిన దాడుల్లో వందల మంది చనిపోయారు. అలాంటి భయానక పరిస్థితుల తర్వాత ఏ షాపుకెళ్లినా మెటల్ డిటెక్టర్లు లేకుంటే అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక.. అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ, సమాజాన్ని అస్థిరపర్చే టెర్రిరిస్టుల మీద ఉక్కుపాదం మోపారు' అని ఈటల రాజేందర్ వివరించారు.

'కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల రాజకీయం కోసం.. మత కలహాలు సృష్టించే వారిని పట్టుకోలేక, నియంత్రించే దమ్ములేక, దాడులకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై హత్యా కేసులు పెట్టించి.. బీజేపీ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గం. ఇటువంటి వైఖరి తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. తెలంగాణలో స్లీపర్ సెల్స్ ఉన్నాయని, టెర్రిస్టులకు అడ్డాగా మారిందని, రోహింగ్యాలు అక్రమంగా వలస వస్తున్నారని కేంద్ర ఏజెన్సీలు హెచ్చరించినా.. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులను నివారించలేదు' అని ఈటల వ్యాఖ్యానించారు.

'ఇతర రాష్ట్రాల నుంచి పోలీసులు తెలంగాణకు వచ్చి టెర్రిస్టులను పట్టుకున్న ఘటనలు ఉన్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటన తర్వాత హిందూ ప్రజానీకం ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని కించపర్చే ప్రసంగాలు చేస్తున్నది ఎవరో తేలిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో సంఘవిద్రోహ శక్తుల కుట్రలను నిగ్గు తేల్చాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిందూ ప్రజల ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని కాపాడటంలో విఫలమైంది. రేవంత్ రెడ్డి కేవలం ఎంఐఎం పార్టీ మెప్పు కోసం, ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే పనిచేస్తున్నరు' అని ఈటల రాజేందర్ ఆరోపించారు.

Whats_app_banner