Harish Rao : మరోసారి తెలంగాణకు గుండు సున్న.. కాంగ్రెస్, బీజేపీపై హరీష్ రావు సెటైర్లు
Harish Rao : కాంగ్రెస్, బీజేపీపై మాజీమంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మరోసారి తెలంగాణకు గుండు సున్న సాధించారని ఎద్దేవా చేశారు. పక్కనున్న ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుంటే.. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉండే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు.
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎంపీలపై మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కేంద్రం పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేస్తుంటే.. తెలంగాణకు ఏం సాధిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఉంటే.. తెలంగాణకు నిధులు సాధించేవారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు నిధులు తీసుకురావడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని ట్వీట్ చేశారు.
'మరోసారి తెలంగాణకు గుండు సున్నా. గోదావరి పుష్కరాల కోసం కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి రూ.100 కోట్ల నిధులు ఇచ్చింది. కానీ తెలంగాణకు గుండు సున్న ఇచ్చింది. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్ ఘోరంగా విఫలమయ్యాయి. మన రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న.. ఒక్క రూపాయి కూడా కేంద్రం తెలంగాణకు ఇవ్వలేదు' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
'ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక నిధుల కింద రూ. 15 వేల కోట్లు మంజూరు కాగా.. తెలంగాణకు మాత్రం దక్కింది గుండు సున్న. లోక్‌సభలో బీఆర్ఎస్ బలమైన స్థానంలో ఉండి ఉంటే.. ఈ అన్యాయాన్ని మేము సహించేవాళ్లము కాదు' అని హరీష్ రావు ట్వీట్ చేశారు. హరీష్ రావు చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణను ఏపీతో పోల్చడంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు దీన్ని వ్యతిరేకిస్తుంటే.. బీఆర్ఎస్ సోషల్ మీడియా క్యాడర్ సపోర్ట్ చేస్తోంది.
అఖండ గోదావరి కోసం..
2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్కరాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. పుష్కరాల నేపథ్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా.. తూర్పుగోదావరి జిల్లాకు ఈ వంద కోట్ల నిధులు కేటాయించారు. కేంద్రం నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో.. పర్యాటక శాఖ అధికారులు త్వరలోనే పుష్కరాల పనులను ప్రారంభించనున్నారు.
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి నివేదిక రూపొందించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఓ బృందాన్ని కలెక్టర్ ఏర్పాటు చేశారు.