CM Revanth Reddy : మోసగాళ్ల మాటలు విని మోసపోవద్దు, ఈ నెల 21 నుంచి గ్రూప్-1 పరీక్షలు యథాతథం - సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొందరు రాజకీయ లబ్దికోసం అభ్యర్థులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పదేళ్ల పాటు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్... ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులను రెచ్చగొడుతుందన్నారు.
గ్రూప్-1 పరీక్షల విషయంలో అపోహలను నమ్మొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కొందరు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లు సహా అన్ని నిబంధనలు పాటిస్తున్నామన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేసిందని విమర్శించారు. ఇప్పుడు పోటీ పరీక్షలను వాయిదా వేయాలని విద్యా్ర్థులను రెచ్చగొడుతుందన్నారు. పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ....గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి యథాతథంగా జరుగుతాయన్నారు.
జీవో 55 ప్రకారమే ఉద్యోగాలు భర్తీ
అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పటికే 95 శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. మిగిలిన 5 శాతం మంది కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పదేళ్ల పాటు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్, బీజేపీ మాయమాటలను నమ్మకండన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత నిబంధనలు మారిస్తే కోర్టులు కొట్టివేస్తాయన్నారు. జీవో 55 ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నష్టం జరిగేదన్నారు.
గ్రూప్-1 మెయిన్స్‌లో 1:50కి కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాల భర్తీపై బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదన్నారు. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీ చేపట్టలేదన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులను ఎప్పుడైనా కలిశారా? అని ప్రశ్నించారు. ఎప్పుడైనా అశోక్ నగర్‌కు వచ్చి మాట్లాడారా? కనీసం ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారా? అని ప్రశ్నించారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణను కోర్టులు సమర్థించాయని, విద్యార్థులు అందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మోసగాళ్ల మాటలు విని మోసపోవద్దని నిరుద్యోగులను కోరుతున్నానన్నారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పట్ల అనుచితంగా ప్రవర్తించవద్దని పోలీసులను కోరుతున్నామన్నారు.
నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది
కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చిన ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 15 వేల మంది పోలీస్ సిబ్బందిని కొత్తగా నియమించామన్నారు. 65 రోజుల్లోనే 11,067 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేశామన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. 564 గ్రూప్-1 పోస్టులకు మెయిన్స్ పరీక్షను సోమవారం నుంచి నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు.
గతంలోని జీవో 55 రద్దుచేసి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలోనే జీవో 29 తెచ్చామన్నారు. ఈ జీవోతో రిజర్వేషన్లు ఖాళీల భర్తీ విషయంలో ఒక పోస్టు ఖాళీగా ఉన్న 1:50 పిలవాలని నిర్ణయించామన్నారు. దీంతో 31 వేల మందికి పైగా మెయిన్స్‌కు అర్హత సాధించారన్నారు. ఇప్పుడు 1:100 చొప్పున మెయిన్స్ నిర్వహించాలని ఆందోళన చేస్తున్నారు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనలను మధ్యలో మారిస్తే కోర్టులు కొట్టివేస్తాయన్నారు.
సంబంధిత కథనం