Double Decker Corridor : హైదరాబాద్‌లో తొలి 'డబుల్ డెక్కర్ కారిడార్' - ఇవాళే శంకుస్థాపన, ప్రత్యేకతలివే
Double Decker Corridor in Hyderabad : హైదరాబాద్‌లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కు అడుగుపడనుంది. జంట నగరాలతో పాటు 5 జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. కీలమకైన ఈ ప్రాజెక్ట్ కు ఇవాళ(మార్చి 8) సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
Double decker corridor in Hyderabad : జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తెలంగాణ సర్కార్ నడుంబిగించింది. జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-44పై దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు రూ.1,580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.320 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండ్లకోయ జంక్షన్ సమీపంలో ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి డబుల్ డెక్కర్ కారిడార్‌కు(Double decker corridor) నేడు నాంది ప్రస్థానం ప్రారంభం కానుంది.
హైదరాబాద్‌లో తొలి 'డబుల్ డెక్కర్ కారిడార్' - ఇవాళే శంకుస్థాపన, ప్రత్యేకతలివే
హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్-ఆదిలాబాద్ మీదుగా సాగే ఎన్‌హెచ్-44పైన జంట నగరాల్లో విపరీతమైన వాహన రద్దీతో నగర ప్రజలు, ప్రయాణికులు నిత్యం పలు అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో సికింద్రాబాద్‌లో రహదారి విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్‌కు(Rajiv Rahadari Elevated Corridor) కంటోన్మెంట్ ప్రాంతంలోని నిబంధనలు ఆటంకంగా మారాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో రహదారుల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జనవరి అయిదో తేదీన స్వయంగా కలిసి రాజధాని నగరంలో కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారుల విస్తరణ రక్షణ శాఖ భూములు తమకు అప్పగించాలని, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన రక్షణ శాఖ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అంగీకరిస్తూ మార్చి ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఇలా....
ఎన్‌హెచ్-44పై సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్‌బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫాం రోడ్డు వద్ద ముగుస్తుంది.
మొత్తం కారిడార్ పొడవు 5.320 కిలోమీటర్లు.
ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కిలోమీటర్లు ఉంటుంది.
అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.600 కి.మీ ఉంటుంది.
మొత్తం 131 పియర్స్ (స్తంభాలు) ఉంటాయి.
మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు.
ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా (0.248 కి.మీ. వద్ద), (0.475 కిలోమీటర్ వద్ద) రెండు చోట్ల ర్యాంపులు నిర్మిస్తారు.
ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణం మరింత క్షేమంగా, వేగంగా, సుఖవంతంగా సాగనుంది.
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో ప్రయోజనాలు...
ఎలివేటెడ్ కారిడార్ (Elevated Coridor)నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యారడైజ్ జంక్షన్ వద్ద రోజుకు సగటున 1,57,105 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ ఫర్ డే -పీసీయూ) పయనిస్తుంటే, ఓఆర్ ఆర్ జంక్షన్ సమీపంలో 72,687 వాహనాలు పయనిస్తున్నాయి. ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో నిత్యం వాహనదారులు, ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు. తరచూ రహదారి ప్రమాదాలతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. క్షతగాత్రులవుతున్నారు. అత్యవసర సమయాల్లో గమ్యాన్ని చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఒత్తిడి, అసహనానికి గురవుతున్నారు. వాహన రద్దీతో గంటలకొద్ది ట్రాఫిక్ నిలిచిపోతుండడంతో ఇంధనానిని భారీగా వ్యయం అవుతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయం కలిసిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గుతుంది. ప్రమాదాల సంఖ్య తగ్గిపోనుంది.
ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు....
* మొత్తం కారిడార్ పొడవు: 5.320 కి.మీ.
* ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 4.650 కి.మీ.
* అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.600 కి.మీ.
* పియర్స్: 131
* అవసరమైన భూమి: 73.16 ఎకరాలు
* రక్షణ శాఖ భూమి: 55.85 ఎకరాలు
* ప్రైవేట్ ల్యాండ్: 8.41 ఎకరాలు
* అండర్‌గ్రౌండ్ టన్నెల్‌కు: 8.90 ఎకరాలు
* ప్రాజెక్టు వ్యయం: రూ.1,580 కోట్లు
* జాతీయ రహదారి-44లో సికింద్రాబాద్‌తో పాటు ఆదిలాబాద్ వైపు జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి
* ఆదిలాబాద్ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం ఉంటుంది. ఇంధనం మిగులుతో వాహననదారులకు వ్యయం తగ్గనుంది.
* నగరం నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ ఆర్ వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. మేడ్చల్-మల్కాజిగిరి-మెదక్-కామారెడ్డి-నిజామాబాద్-నిర్మల్-ఆదిలాబాద్‌కు ప్రయాణికుల, సరకు రవాణా చేరవేత వేగంగా సాగుతుంది.