TTD New Proposal: నడక మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుకు టీటీడీ మొగ్గు-ttd favors construction of elevated corridor along the walkway ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd New Proposal: నడక మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుకు టీటీడీ మొగ్గు

TTD New Proposal: నడక మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుకు టీటీడీ మొగ్గు

HT Telugu Desk HT Telugu
Sep 13, 2023 06:40 AM IST

TTD New Proposal: తిరుమల నడక మార్గంలో వన్య ప్రాణుల నుంచి భక్తుల్ని రక్షించేందుకు ప్రత్యామ్నయాలు పరిశీలిస్తోంది. నడక మార్గం చుట్టూ కంచె వేయడం సాధ్యం కాదని అంచనాకు రావడంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై చర్చిస్తోంది. జంతువుల రాకపోకల కోసం ఓవర్‌ పాస్‌ల నిర్మాణంపై కూడా టీటీడీ అధ్యయనం చేస్తోంది.

నడక మార్గాల్లో భద్రతపై అటవీ శాఖ అధ్యయనం
నడక మార్గాల్లో భద్రతపై అటవీ శాఖ అధ్యయనం

TTD New Proposal: తిరుమలలో కాలి నడక మార్గంలో కొండపైకి వెళ్లే భక్తులకు జంతువుల నుంచి ముప్పు లేకుండా ఉండేలా ప్రత్యామ్నయాలను టీటీడీ పరిశీలిస్తోంది. అలిపిరి-తిరుమల నడకమార్గంలో భక్తుల కోసం ఎలివేటెడ్‌ ఫుట్‌పాత్‌ నిర్మాణం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో జంతువులు సులభంగా నడకదారిని దాటేందుకు ఓవర్‌ పాస్‌ల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని ఏపీ ప్రిన్సిపల్‌ సీసీఎఫ్‌వో వై.మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం తిరుమల శ్రీవారిని చేరుకోడానికి రెండు నడక మార్గాలు ఉన్నాయి.వీటిలో ఒకటి 7.2 కిలోమీటర్ల దూరంతో 3550 మెట్లతో ఉన్న అలిపిరి మెట్ల మార్గం ఒకటి రెండోది 2.1కిలోమీటర్ల దూరంతో 2650 మెట్లతో ఉణ్న శ్రీవారి మెట్టు మార్గం.. రెండు నడక దారుల్లో ఇనుప కంచె వేయాలని ఇటీవల కాలంలో డిమాండ్ వస్తోంది.

ఆగష్టు 11న నెల్లూరు జిల్లాకు చెందిన లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన తర్వాత అటవీ శాఖ మెట్ల మార్గానికి సమీపంలో నాలుగు చిరుతల్ని బోనుల్లో బంధించింది. మరికొన్ని చిరుతలు మెట్ల మార్గానికి సమీపంలో సంచరిస్తున్నట్లు గుర్తించి వాటిని కూడా బంధించేందుకు ప్రయత్నిస్తోంది

మరోవైపు వన్యప్రాణుల నుంచి శాశ్వతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రత్యామ్నయాలను టీటీడీ పరిశీలిస్తోంది. శేషాచలం కొండల్లో విస్తరించిన తిరుమల రక్షిత అభయారణ్యంలో 8వేల ఎకరాలు మాత్రమే టీటీడీ పరిధి ఉంది. జంతువుల ఫ్రీ పాసింగ్ ఏరియాలో కంచె నిర్మాణం చేపట్టాలనే చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై సర్వే నిర్వహించడానికి కేంద్ర అటవీ శాఖకు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు టీటీడీ ప్రతిపాదనలు పంపింది. చీఫ్ వైల్డ్‌ లైఫ్ వార్డెన్, ప్రిన్సిపల్ చీఫ్‌ కన్జర్వేటర్ ఆఫ్ వైల్డ్‌ లైఫ్‌లకు కూడా ఈ ప్రతిపాదనలు చేసింది. తిరుమల కొండల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

టీటీడీ అనుమతి కోరినే నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు సర్వే కోసం అధ్యయనం ప్రారంభించారు. నడక మార్గంలో 'రెండున్నర నెలల క్రితం ఓ బాలుడిపై దాడి, ఆపై చిరుత దాడిలో బాలిక మృతి నేపథ్యంలో అలిపిరి నడకదారిలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి తరహాలో ఎలివేటెడ్‌ ఫుట్‌పాత్‌ నిర్మాణంతో పాటు ఇతర ప్రత్యామ్నయాలు పరిశీలిస్తున్నారు. జంతువులు నడకదారిలో అటూ ఇటూ స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా యానిమల్‌ ఓవర్‌ పాస్‌ నిర్మాణం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌, హైదరాబాద్‌కు చెందిన ఐటీ కోర్‌ సంస్థ, తితిదే, అటవీశాఖ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

నడకదారి ఇరువైపులా10 నుంచి 20 మీటర్ల పరిధిలో చెట్ల తొలగిస్తే జంతువు వచ్చినా భక్తులు గుర్తించి తప్పించుకునే అవకాశం ఉంది. దీనిని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

నడక మార్గంలో మరో ఐదు చిరుతలు…

తితిదే, అటవీశాఖ ఆధ్వర్యంలో 500 కెమెరాలతో రియల్‌ టైమ్‌ వైల్డ్‌లైఫ్‌ మానిటరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నడకదారిలో 130 మంది పనిచేస్తున్నారు. వీరి సంఖ్య పెంచుతామని చెప్పారు. పట్టుకున్న అయిదు చిరుతలతో పాటు మరో అయిదు చిరుతల జాడ గుర్తించినట్లు తెలిపారు.

అందులో రెండు శ్రీవారి మెట్టు, ఈవో క్యాంప్‌ కార్యాలయం వద్ద, మూడు అలిపిరి కాలిబాటలో ఉన్నాయని వివరించారు. లక్షితను చంపిన చిరుత డీఎన్‌ఏ రిపోర్టు వచ్చాక ఆ చిరుతను జూలోనే ఉంచి మిగిలిన వాటిని 300-400 కి.మీ. దూరంలో విడిచిపెడతాం. ఘాట్‌ రోడ్లలో గుంపులుగా ద్విచక్ర వాహనాలు అనుమతించడంపై తితిదే ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎఫ్‌వో నాగేశ్వరరావు, తితిదే డీఎఫ్‌వో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం