PM Modi to Adilabad: నేడు ఆదిలాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. తెలంగాణలో రెండ్రోజుల పర్యటన-prime minister modi will visit adilabad today a two day visit to telangana ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi To Adilabad: నేడు ఆదిలాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. తెలంగాణలో రెండ్రోజుల పర్యటన

PM Modi to Adilabad: నేడు ఆదిలాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. తెలంగాణలో రెండ్రోజుల పర్యటన

HT Telugu Desk HT Telugu
Mar 04, 2024 08:21 AM IST

PM Modi to Adilabad: ప్రధాని నరేంద్ర మోదీ రెండ్రోజులు పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు ఆదిలాబాద్‌లో పలు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ (ANI)

PM Modi to Adilabad: ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణ Telanganaలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన కోసం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాదుకు రానున్న నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రానికి జాతీయ స్థాయిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు.

రూ. 250 కోట్లతో అమృత్ Amrit పథకం ద్వారా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య కేంద్రాలు మరియు 450 కోట్లతో చేపట్టిన ఆదిలాబాద్ డేలా మహారాష్ట్ర రహదారి , రామగుండం లో 850 మెగావట్ల విద్యుత్ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.

ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ఆదిలాబాద్‌ నుంచి ప్రారంభించనున్నారు.

ఉమ్మడి ఆదిలాబాదులో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకరం చుడతారని స్థానిక నాయకులు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ప్రకటించిన విధంగా ఆదిలాబాదులో విమానాశ్రయం, ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు నిర్మల్ మీదుగా రైల్వే లైన్, అతిపెద్ద పత్తి మార్కెట్ ను టెక్స్‌టైల్‌ పార్కుగా తీర్చి దిద్దడానికి, ట్రైబల్ యూనివర్సిటీ తదితర పెండింగ్ పనులను పనులు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ ఏర్పాట్లు..

తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లలోని ప్రజలను సుమారు లక్ష మందిని సభకు ఆహ్వానిస్తూ స్థానిక నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, ఎంపీ సోయం బాపూరావు రాష్ట్రస్థాయి నాయకులు మోడీ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ పర్యటనలో ప్రధాని మొత్తం రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 4వ తేదీన ఆదిలాబాద్‌లో రూ.6,697 కోట్ల పనుల్ని ప్రారంభిస్తారు. 5వ తేదీన సంగారెడ్డిలో రూ.9,021 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆదిలాబాద్‌ నుంచి ప్రధాని ప్రారంభించ నున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది.

ఆదిలాబాద్‌ పర్యటన ఇలా….

ప్రధాని సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా కేందానికి చేరుకుంటారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు.

మోదీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ రెండు వేదికలు ఏర్పాటు చేయగా, అందులో మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పాల్గొంటారు.

అనంతరం రెండో వేదికపైకి వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందులో కిషన్‌రెడ్డితో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొననున్నారు.

ఆదిలాబాద్‌లో మోదీ సుమారు రెండు గంటల పాటు గడుపుతారు. సభ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి నాందేడ్‌కు, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకుని రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు.

మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చి ఆర్గనైజేషన్‌ (సీఏఆర్‌ఓ)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.ప్రధాని పర్యటన పురస్కరించుకుని మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

 

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి.

Whats_app_banner