Cyber Crime Reporting : సైబర్ మోసాలకు గురయ్యారా? ఆన్ లైన్ లో ఇలా ఫిర్యాదు చేయండి?
Cyber Crime Reporting : సైబర్ క్రైమ్ పై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వెబ్ సైట్ నిర్వహిస్తోంది. ఈ వెబ్ సైట్ లో సైబర్ క్రైమ్ పై ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం.
Cyber Crime Reporting : సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ నిర్వహిస్తోంది. ‘నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్’లో బాధితులు ఫిర్యాదులు చేయవచ్చు. దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్, యూట్యూబ్ వీడియోలు, కొరియర్ సర్వీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఫలితంగా బాధితులు భారీ మొత్తంలో నష్టపోతున్నారు. అయితే సైబర్ మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే కొద్దో గొప్పో కోల్పోయిన డబ్బును తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ స్కామ్‌ల బారిన పడితే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే సంబంధిత వెబ్‌సైట్‌లో కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు.
హెల్ప్ లైన్ నంబర్ 1930
‘నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్’లో బాధితులు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్ సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. 1930 హెల్ప్ లైన్ నంబర్‌కి సైతం కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు. అయితే ఘటన జరిగిన 24 గంటల్లోపే ఈ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి. అప్పుడే సదరు ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేసేందుకు అధికారులకు వీలుంటుంది. మోసపోయామని తెలిస్తే ఏ మాత్రం సందేహించకుండా వెను వెంటనే రిపోర్ట్ చేయడం మంచిది. వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసే ప్రాసెస్ చూద్దాం.
- ముందు వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి https://cybercrime.gov.in . పోర్టల్‌కి వెళ్లాలి. హోమ్ పేజీలోకి వెళ్లి ‘File a complaint’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ కొన్ని నియమాలు, షరతులను చూపిస్తుంది. వీటిని చదివి యాక్సెప్ట్ చేసి, ‘Report other cybercrime’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత ‘citizen login’ ఆప్షన్ సెలెక్ట్ చేసి.. మీ పేరు, ఫోన్ నంబర్, ఈ- మెయిల్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసి అక్కడున్న క్యాప్చా కోడ్‌ను బాక్సులో ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. తర్వాతి పేజీలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు అసలు ప్రక్రియ మొదలవుతుంది.
- ఈ పేజీలో ఒక ఫారం కనిపిస్తుంది. మీకు జరిగిన సైబర్ మోసం గురించి ఈ ఫారంలో పేర్కొనాలి. అయితే, ఇందులో 4 సెక్షన్లు ఉంటాయి. సాధారణ సమాచారం(General Information), బాధితుల సమాచారం(Victim Information), సైబర్ నేరానికి సంబంధించిన సమాచారం(Cybercrime Information), ప్రివ్యూ(Preview) సెక్షన్‌లు ఉంటాయి.
- ప్రతి సెక్షన్‌లో అడిగిన వివరాలను సమర్పిస్తూ ప్రక్రియను పూర్తి చేయాలి. మొదటి 3 సెక్షన్లు పూర్తయ్యాక ప్రివ్యూ సెక్షన్‌లో మళ్లీ ఒకసారి వెరిఫై చేయాలి. అన్ని వివరాలు సరిగ్గానే ఉన్నాయని భావిస్తే సబ్మిట్(Submit) బటన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఘటన ఎలా జరిగిందనే వివరాలు నమోదు చేయాలి. నేరానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌లు, ఫైల్స్ వంటి ఆధారాలు, సాక్ష్యాలు ఉంటే వాటిని పొందుపర్చాలి. వివరాలు సేవ్ చేసి నేరగాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫిల్ చేయాలి.
- చివరికు ఒకసారి అప్లికేషన్ వెరిఫై చేసుకుని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే, కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కంప్లైంట్ ఐడీతో పాటు ఇతర వివరాలతో కూడిన ఇ మెయిల్ వస్తుంది. ఆ తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం