BRS Party : టార్గెట్ క్లియర్ కట్...! మహారాష్ట్రలో కేసీఆర్ ప్లాన్ ఇదేనా...?-brs plans more public rallies in maharashtra as party set to contest local body elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Party : టార్గెట్ క్లియర్ కట్...! మహారాష్ట్రలో కేసీఆర్ ప్లాన్ ఇదేనా...?

BRS Party : టార్గెట్ క్లియర్ కట్...! మహారాష్ట్రలో కేసీఆర్ ప్లాన్ ఇదేనా...?

Mahendra Maheshwaram HT Telugu
Apr 02, 2023 03:50 PM IST

BRS Party Latest News: జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇందులో భాగంగా ప్రధానంగా మహారాష్ట్రపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే రెండు సభలు నిర్వహించిన కేసీఆర్… మరిన్ని సభలను తలపెట్టాలని యోచిస్తున్నారు.

మహారాష్ట్ర నేతలతో కేసీఆర్
మహారాష్ట్ర నేతలతో కేసీఆర్ (twitter)

BRS Meetings in Maharashtra: తెలంగాణ రాష్ట్ర సమితి.. ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారింది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పేలా పక్కాగా పావులు కదుపుతున్నారు కేసీఆర్. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. రైతు సంఘాల నేతలతో చర్చలు కూడా జరిపారు. అంతేకాదు బీఆర్ఎస్ విస్తరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మహారాష్ట్రపై తెగ పెట్టేస్తున్నారు. ఇప్పటికే నాందేడ్ జిల్లాలో రెండు భారీ బహిరంగ సభలను తలపెట్టిన బీఆర్ఎస్.... రాబోయే రోజుల్లో మరిన్ని సభలు నిర్వహించాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే... మరోవైపు హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా కూడా ఆ రాష్ట్రానికి చెందిన నేతల చేరికల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది.

ప్లాన్ ప్రకారమే అడుగులు....

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను విస్తరించేందుకు ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు ఆ పార్టీ బాస్ కేసీఆర్. ఇప్పటికే కీలకమైన రెండు బహిరంగ సభల ద్వారా భారీ ఎత్తున స్థానిక నేతలను చేర్చుకున్నారు. కాందర్ లోహా సాక్షిగా వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు. జిల్లా పరిషతులపై గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలను అక్కడ మోహరించిన కేసీఆర్.... స్థానికంగా బలంగా ఉండే నేతలను పార్టీలోకి రప్పించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా రైతులు, ఉచిత కరెంట్, పంట సాయం వంటి అంశాలపై దృష్టిపెడుతూ ముందుకెళ్తున్నారు. కనీసం తొమ్మిది నుంచి పది జిల్లా పరిషత్‌లు గెలవాలని బీఆర్ఎస్ చూస్తున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు జిల్లాలపై దృష్టిపెట్టి... నెమ్మదిగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని కేసీఆర్ చూస్తున్నారట..! మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని ఇప్పటికే అక్కడి నేతలకు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. తొందర్లోనే మహిళా, విద్యార్థి కమిటీలతో పాటు మిగతా అనుబంధ కమిటీలను కూడా పూర్తి చేయాలని చూస్తున్నారట..! పార్టీ అజెండాను ప్రకటించింది స్థానిక భాషలో కూడా పంపిణీ చేసే దిశగా కేసీఆర్ వర్కౌట్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల మేరకు తెలుస్తోంది.

మొత్తంగా తెలంగాణ మోడల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్న కేసీఆర్... మహారాష్ట్రలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో గెలవటంతో ద్వారా సత్తా చాటాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? మహారాష్ట్రలోని రైతులపై ఆశలు పెటుకున్న కేసీఆర్ అనుకున్న ఫలితాలు సాధిస్తారా..? బీఆర్ఎస్ ప్లాన్స్ ఎంత వరకు సక్సెస్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది….!

Whats_app_banner

సంబంధిత కథనం