CM KCR: అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలన్న సిఎం కేసీఆర్-cm kcr has ordered to provide speedy compensation to the farmers who lost due to untimely rains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr: అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలన్న సిఎం కేసీఆర్

CM KCR: అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలన్న సిఎం కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Mar 29, 2023 07:25 AM IST

CM KCR: తెలంగాణలో అకాల వర్షాలు, వడగండ్లతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. ఎకరాకు రూ.10వేల పరిహారాన్ని ప్రకటించిన కేసీఆర్‌, పరిహారాన్ని రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ (twitter)

CM KCR: అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయాన్నివెంటనే రైతులకు అందించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం తదితర అంశాలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

వడగండ్ల వానలతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లిన నేపథ్యంలో, సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను పరామర్శించారు. రైతులు నష్టపోయిన పంటలకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి, జరిగిన పంటనష్టంపై పూర్తి వివరాలను అందజేయాలని సూచించారు. ఈ మేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని చీఫ్‌ సెక్రటరీని, వ్యవసాయ శాఖను సీఎం ఆదేశించారు. బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేయాలని సూచించారు.

తెలంగాణలో రెండోవిడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని, ఆ గొర్రెల పంపిణీ వ్యవహారాలు సాగాలని స్పష్టంచేశారు. రెండో విడతలో రూ. 6వేల కోట్ల ఖర్చుతో 3.63 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలం ఉన్న పేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటించిన రూ. 3 లక్షల ర్థికసాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించి, ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో పోడు భూముల్లో అర్హులైనవారికి పట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉన్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి.. లక్షా 55 వేలమంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు పాస్‌బుకులు ముద్రించి సిద్ధంగా ఉంచినట్టు వివరించారు. ప్రభుత్వ నిర్ణయం కోసం తాము సిద్ధంగా ఉన్నాయని వారు పేర్కొనగా.. పోడు పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సీతారాముల కల్యాణానికి కోటి రూపాయలు

శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేకనిధి నుంచి కోటి రూపాయలను సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా భద్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో.. దేవాదాయశాఖ అభ్యర్థన మేరకు, కల్యాణ నిర్వహణ కోసం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు

Whats_app_banner