T Congress Coalition Politics : తెలంగాణ కాంగ్రెస్ లో పొత్తుల రచ్చ.. లీక్ లు ఇస్తున్నారా..?
TS Congress Coalition Politics : తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ పొత్తుల రాగం వినిపిస్తుంది. బీఆర్ఎస్ తో పొత్తు అంటూ సీనియర్ నేతల లీక్ లు ఇస్తున్నారు. ప్రజలే నిర్ణయిస్తారంటూ ఓ రకమైన హింట్ ఇస్తున్నారు. ఇవి కాస్త హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
TS Congress Coalition Politics : తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిత్య పోరాట యోధులు, ప్రత్యర్థులపై కాదండోయ్ సొంత పార్టీ నేతలపైనే. పాదయాత్రల నుంచి పార్టీ పదవుల వరకు అన్నీ తమకే అన్నట్లు ఉంటుంది నేతల తీరు. పొరపాటున మరో నేతకు కాస్త ఇంపార్టెన్స్ పెరిగితే.. సేవ్ కాంగ్రెస్ పేరుతో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సూత్రాన్ని పక్కాగా ఫాలో అవుతున్న కాంగ్రెస్ నేతలు.. పార్టీలో పాలిటిక్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో తాజాగా మళ్లీ పొత్తుల రచ్చ మొదలైంది. ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెట్టిన పొత్తు చిచ్చు ఆరక ముందే మరో సీనియర్ నేత జానారెడ్డి బీఆర్ఎస్ తో పొత్తు ఉండొచ్చని ఓ మాట వదిలారు. అంతే ఇంకేముంది బీజేపీకి మళ్లీ ఆయుధం దొరికింది. కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. నాటకాలు ఆడుతున్నాయని విమర్శలు మొదలయ్యాయి.
జానారెడ్డి ఇలా పొత్తు ప్రస్తావన తెచ్చారో లేదో మళ్లీ పార్టీలో చర్చ మొదలైంది. పాదయాత్రలు, టీఎస్పీఎస్సీపై దండయాత్రలు, పరువు నష్టం దావాలు అంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలు అంతా ప్రజల్ని మభ్యపెట్టడానికేనా అంటూ విమర్శలు వస్తున్నాయి. పైకి పోరాటాలు లోపల పొత్తులా అంటూ కింద స్థాయి కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. అయితే పొత్తులపై లీక్ లు ఇస్తున్న కాంగ్రెస్ పెద్ద నేతలు.. అధిష్ఠానం సూచనలతోనే ఇలా మాట్లాడుతున్నారా లేక పార్టీలో నేనున్నా అనేందుకు అప్పుడప్పుడూ నోరుజారుతున్నారా? అనే ప్రచారం కూడా లేకపోలేదు.
కాంగ్రెస్ కు పొత్తుల సంకటం!
తెలంగాణలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ కు అంతో ఇంతో గెలుపు శాతం లేకపోలేదు. ప్రస్తుతానికి సెకండ్ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని యువ అధినాయకత్వం తహతహలాడుతుంది. అయితే సీనియర్ నేతల గళం మాత్రం వేరేలా ఉంది. టైం కుదిరినప్పుడల్లా పొత్తులపై ఓ మాట వదులుతూ... యువనేతలను ఇరకాటంలో పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాస్త అటు ఇటుగా 50కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్న నేతలను పొత్తులు మాటలు కాస్త గందరగోళానికి గురిచేస్తున్నాయి. తెలంగాణలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల వీక్ పాయింట్లు పట్టుకునే పనిలో ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పోటీ ఇచ్చే సత్తా బీజేపీకి ఉందని నిరూపించుకుంది. ఇలాంటి తరుణంలో బలమైన బీఆర్ఎస్ ను, బలపడుతున్న బీజేపీని తట్టుకుని నిలబడాలంటే నిత్యం ప్రజల్లో ఉంటూ, సమస్యలపై పోరాటాలు చేయాల్సిన కాంగ్రెస్ నేతలు పొత్తుల రాగం పాడుతున్నారు. బీఆర్ఎస్ ను జాతీయపార్టీగా చెబుతున్న ఆ పార్టీ నేతలు.. సమయం దొరికినప్పుడల్లా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీపై విమర్శలు చేస్తూనే... కాంగ్రెస్ కు వైపు చూస్తున్నారు. కేంద్రంలో తిరిగి అధికారంలో రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్... ముందు రాష్ట్రాల్లో పరిస్థితులను చక్కదిద్దే పనిచేస్తే బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు.
నిన్న జానారెడ్డి, మొన్న కోమటిరెడ్డి?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ వివాదంలో బీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతకు మద్దతుగా నిలిచింది. ఈ విషయాలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి.. బీఆర్ఎస్ తో పొత్తు ఉండే అవకాశం ఉందన్నారు. అయితే ఆ తర్వాత తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చినా... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటీవల దిల్లీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్ఎస్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రచ్చ జరిగింది. దీంతో తమ మాటలు మీడియా వక్రీకరించిందని, నేను అలా అనలేదని కోమటిరెడ్డి మాట దాటవేశారు. ఇదంతా ఎలా ఉన్నా మరో కొన్ని నెలల్లో ఎన్నికలు జరిగే క్రమంలో కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న పొత్తుల వ్యాఖ్యలు పార్టీ కేడర్ ను ఇబ్బంది పెడుతున్నాయని టాక్ నడుస్తోంది.
సంబంధిత కథనం