TS Assembly Elections : ఆ సెంటర్ లో బీఆర్ఎస్ వర్సెస్ కామ్రేడ్స్.. ఎవరు నెగ్గుతారో..?
తెలంగాణలో ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సీటు అంశం ఆసక్తికరంగా మారుతోంది. బీఆర్ఎస్ తో పొత్తులో భాగంగా… తామే ఇక్కడ్నుంచి పోటీ చేస్తామంటూ కామ్రేడ్లు ప్రకటిస్తున్నారు.
Miryalaguda Assembly Constituency: తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. మరికొద్ది నెలల్లోనే ఎన్నికల శంఖారావం మోగనుంది. దీంతో ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటూనే... మరోవైపు రేస్ గుర్రాలపై ఫోకస్ పెడుతున్నాయి. అయితే బీఆర్ఎస్ తో కలిసి కామ్రేడ్లు పోటీ చేస్తారన్న చర్చ మునుగోడు బైపోల్ నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మునుగోడులో పొత్తు సక్సెస్ కావటంతో…వచ్చే ఎన్నికల్లోనూ కలిసి నడిచే అవకాశం ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా పలు కీలకమైన సీట్లపై కన్నేశారు కమ్యూనిస్టులు. తాము ప్రతిపాదించే సీట్లను కేటాయించాలని...తామే బరిలో ఉంటామంటూ నేతలు ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఇక పలుచోట్ల అయితే గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు నేతలు. ఫలితంగా ఆయా సీట్లలోని బీఆర్ఎస్ కేడర్ గందరగోళానికి గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు. ఆ తర్వాత క్రమంగా బలహీనపడిపోయారు. తాజాగా జరిగిన మునుగోడులో పోటీ చేయకుండా బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తుకు సై అంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ వంటి స్థానాలపై కన్నేశారు. ఇందులోనూ మిర్యాలగూడ సీటు విషయం మాత్రం... ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ్నుంచి సీపీయం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి పోటీ చేయాలని చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... పొత్తులో భాగంగా తానే బరిలో ఉంటానని చెప్పేస్తున్నారు. ఓ రకంగా ఈ సీటుపై సీపీయం భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. బీఆర్ఎస్ తో పొత్తు కుదిరితే... ఈ సీటును వదులుకోకుండా, ఎలాగైనా బరిలో నిలిచి గెలవాలని చూస్తోంది. ఇప్పటికే జూలకంటి గ్రౌండ్ లో తిరిగేస్తున్నారు. పాత పరిచయాలతో విస్తృత్తంగా ప్రజల్లోకి వెళ్లే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని...తప్పకుండా తనను గెలిపించాలని కోరుతున్నారట. ఇదే విషయాన్ని జన చైతన్య యాత్రలో భాగంగా ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని కూడా చెప్పారు. మిర్యాలగూడలో సీపీయం తప్పకుండా పోటీ చేస్తుందని ప్రకటన చేశారు.
ఇక ఈ సీటు ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో ఉంది. ఇక్కడ్నుంచి భాస్కర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన.. ఆ తర్వాత కారు ఎక్కారు. 2018లో జరిగిన ఎన్నికలోనూ విక్టరీ కొట్టారు. ఈసారి జరగబోయే ఎన్నికలో కూడా తానే పోటీ చేస్తానని... హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా తనకే టికెట్ వస్తుందని... టికెట్ విషయంలో ఢోకా లేదని ముఖ్య నేతలతో పాటు కేడర్ కు చెబుతున్నారట..!
మొత్తంగా పొత్తు కుదరక ముందే మిర్యాలగూడ వేదికగా బీఆర్ఎస్, సీపీయం మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న టాక్ మొదలైంది. టికెట్ తమకే అంటే తమకే అంటూ భావనలో ఇరు పార్టీల నేతలు ఉండటంతో.. ఎన్నికల నాటికి ఏం జరగబోతుంది…? టికెట్ రేసులో ఎవరు నెగ్గుతారు..? అనేది ఆసక్తికరంగా మారింది. నిజంగానే క్రామేడ్లతో బీఆర్ఎస్ పొత్తు కుదిరితే మిర్యాలగూడ పంచాయితీ గట్టిగానే ఉంటుందన్న చర్చ జరగుతోంది..!
సంబంధిత కథనం