TS Assembly Elections 2023 : ఆ సీనియర్ నేత మనసులోని మాటను పలికారా.. ? లేక పలికించారా..?
TS Assembly Elections 2023: ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. కొద్దిరోజుల కిందట ఓ వేదికపై మాట్లాడిన ఆయన… వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ చేయటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Telangana Assembly Elections 2023: రాజకీయాల్లో ఆయన చాలా సీనియర్ లీడర్. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి ఏ మాత్రం అనుకూలించలేదు. ఫలితంగా పార్టీ కూడా మారి చూశారు. సేమ్ సీన్...! లాభం లేదనుకున్నా సదరు నేత... కారెక్కారు. పార్టీ అధినేత కేసీఆర్ తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. కీలక కార్యక్రమాల్లో కనిపిస్తూ వస్తున్నారు. ఆయనకు నామినేటెడ్ పదవి వస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. మళ్లీ ఎన్నికల వరకు వచ్చింది. కట్ చేస్తే... ఇటీవలే ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందంటూ తన మనసులోని మాటను చెప్పారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను... ఇంట్లో కూర్చోలేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్సే.... జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఫలితంగా ఆయన చేసిన కామెంట్స్ వ్యక్తిగతమా...?లేక ఆయనతో ఎవరైనా పలికించారా అన్న చర్చ మొదలైంది. ఎవరా నేత... ఏంటా కథ ..…?
మోత్కుపల్లి నర్సింహులు... తెలుగు రాజకీయాల్లో చాలా సీనియర్ నేత. 1983లో తొలిసారి ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో టీడీపీలో చేరాడు. 1989,1994,1999లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు మోత్కుపల్లి. ఆ తర్వాత ఆలేరులో ఓడిపోయారు. ఇదే టైంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో ఆలేరు జనరల్ సీటుగా మారింది. దీంతో వ్యూహం మార్చిన మోత్కుపల్లి... 2009 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి కూడా గెలిచారు. ఇక్కడి వరకు బాగానే సాగిన మోత్కుపల్లి రాజకీయం,,, తెలంగాణ ఉద్యమం తర్వాత సీన్ మారిపోయింది. తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉన్న మోత్కుపల్లి... కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అయితే తెలంగాణకు మద్దతు విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఇబ్బందిపడ్డారు. మరోవైపు పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోయింది. ఇదే టైంలో 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని మదిర నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత... ఆయన గ్రాఫ్ మరింత పడిపోయింది. కానీ బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా.. మోత్కుపల్లికి గవర్నర్ ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ అది కల గానే ఉండిపోయింది. ఆ తర్వాత టీడీపీని కూడా వీడిన ఆయన... 2018లో బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేసి ఆలేరులో ఓడిపోయారు.
కారెక్కిన మోత్కుపల్లి....
మోత్కుపల్లి నర్సింహులు 2019లో బీజేపీలో చేరారు. అక్కడ కూడా సెట్ కాలేకపోయారు. 2021 ఏడాదిలో కారెక్కారు. అప్పట్నుంచి కేసీఆర్ తో తెగ తిరగేస్తున్నారు. దళితబంధు స్కీమ్ వైస్ ఛైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం తెగ జరిగింది. కానీ అది రాలేదు. ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని కూడా అనుకున్నారు... కానీ ఆ పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన మరోసారిపై బయటకు వచ్చారు. కొద్దిరోజుల కిందట ఆలేరులో మాట్లాడిన... వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ప్రకటించేశారు. పోటీలో ఉండకపోవడానికి తానేమీ సన్యాసిని కాదని అన్నారు. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని ఇంట్లో కూర్చోవాలంటే కాళ్లు ఆగటం లేదంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్న మోత్కుపల్లి చేసిన కామెంట్స్... జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే గొంగిడి సునీతారెడ్డి, బూడిద భిక్షమయ్య టికెట్ రేసులో ఉండగా... కొత్తగా మోత్కుపల్లి ఎంట్రీ ఇవ్వటంతో సీన్ ఎలా ఉండబోతుందన్న టాక్ గట్టిగా నడుస్తోంది. పోటీపై ఆయన చేసిన కామెంట్స్... తన మనసులోని మాటగా చెప్పారా...? లేక పార్టీ హైకమాండ్ ఆదేశాలతోనే పలికారా అన్న చర్చ కూడా ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
సంబంధిత కథనం