KCR Maharashtra Tour: భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరిన కేసీఆర్
KCR Maharashtra Tour: తెలంగాణ సిఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటన కోసం ప్రగతి భవన్ నుంచి భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు.సోలాపూర్, దారాశివ్ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన కొనసాగనుంది.
KCR Maharashtra Tour: బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన కోసం రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. సోలాపుర్, దారాశివ్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.
ప్రగతిభవన్ వద్ద నుంచి రెండు బస్సులు, సుమారు 600 కార్లతో భారీ కాన్వాయ్‌తో సిఎం కేసీఆర్ తరలి వెళ్లారు.కేసీఆర్‌తో పాటు మరి కొందరు ముఖ్యనేతలు బస్సులో ప్రయాణిస్తున్నారు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లినవారిలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిఆర్‌ఎస్ ముఖ్యనేతలు ఉన్నారు.
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత మార్గం మధ్యలోని ఉమెర్గా పట్టణంలో నేతలంతా భోజనాలు చేస్తారు. అక్కడి నుంచి సోలాపుర్ చేరుకొని రాత్రి బస చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు పండరిపుర్‌లో 'శ్రీ విఠల్ రుక్మిణి' ఆలయాన్ని సీఎం కేసీఆర్, ఇతర ప్రజా ప్రతినిధులు దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఉదయం 11.30 గంటలకు పండరిపుర్ మండలం సర్కోలీ గ్రామానికి చేరుకుంటారు.
సర్కోలీ గ్రామంలో ఎన్సీపీకి చెందిన సోలాపుర్ జిల్లా ప్రముఖ నేత భగీరథ్ భాల్కే సహా పలువురు నాయకులు భారతరాష్ట్రసమితిలో చేరనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. అక్కడ భోజనాలు ముగించుకొని.. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. మార్గం మధ్యలో 3.30 గంటలకు దారాశివ్ జిల్లా తుల్జాపుర్‌లోని ప్రముఖ శక్తిపీఠం 'తుల్జా భవానీ' అమ్మవారిని సీఎం కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు దర్శించుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.
మహారాష్ట్రలో చేరికలపై ప్రత్యేక కసరత్తు…
మహారాష్ట్రలో ప్రస్తుతం 11 లక్షల మంది సభ్యులు ఉన్నారని ఆ పార్టీ చెబుతోంది. మరో పక్షం రోజుల్లో ఆ సైన్యం 30 లక్షలకు చేరుకొంటుందని మహారాష్ట్ర బీఆర్‌ఎస్ విభాగం తెలిపింది. మహారాష్ట్ర బిఆర్‌ఎస్‌ను పరుగులు పెట్టించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ తన మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనాయకులతో ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీకి వినిపించేందుకు ‘చలో ఢిల్లీ ’ పేరుతో భారీ కారు ర్యాలీ నిర్వహించిన తరహాలో ప్రగతి భవన్ నుంచి పండరీపురం యాత్రకు బయలుదేరాలని నిర్ణయించారు. మార్చి 27, 2003వ తేదీన నిర్వహించిన ర్యాలీతో తెలంగాణ అకాంక్షవిషయంలో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించారు.మళ్లీ 20ఏళ్ల తర్వాత కేసీఆర్ అదే తరహా యాత్ర చేపట్టారు.
మరోవైపు కేసీఆర్ పర్యటనకు మహారాష్ట్రలోని బీఆర్‌ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, మహారాష్ట్ర నేత మాణిక్ కదం తదితరులు ఈ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సీఎం కేసీఆర్ వెంట వెళ్లే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిర్దేశిత సమయానికి ప్రగతి భవన్ చేరుకోవాలని సమాచారం అందించారు.