Etela Fires On KCR : మునుగోడు ప్రజలపై టీఆర్ఎస్ దండయాత్ర చేస్తోంది…
Munugodu bypoll 2022: సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. చండూరులో మాట్లాడిన ఆయన... మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
Etela Rajender Fires On CM KCR: 20 ఏళ్లు సోపతి చేసిన తర్వాత తనని పార్టీ నుంచి కేసీఆర్ బయటికి వెళ్లగొట్టారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా... చండూరు లోని ముదిరాజ్ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో.. ప్రభుత్వం వచ్చాక తన పాత్ర ఏందో అందరికీ తెలుసని చెప్పారు.
హుజురాబాద్ లో అందరూ వచ్చి తనని గెలిపించుకున్నారని... హుజురాబాద్ లో ఆరు నెలలు ఎంత వేధించిన ఓపిక పట్టి చివరి రోజు బయటికి వచ్చి తన్ని తరిమేశారని వ్యాఖ్యనించారు. తన గెలుపు ప్రతి పల్లె పటాకులు కాల్చిందన్నారు. పార్లమెంట్లో సోనియాగాంధీ సాక్షిగా సస్పెండ్ చేస్తామని చెప్పినా కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని గుర్తు చేశారు. సొంత పార్టీని ధిక్కరించి కొట్లాడారని గుర్తు చేశారు.
'అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరు ఉండొద్దు. తెలంగాణ వచ్చింది నీ కుటుంబ కోసం కాదు అన్ని వర్గాల ప్రజల కోసం. మూడున్నర ఏండ్లుగా కుమిలిపోతున్నావు.. నీ బ్రహ్మస్థాని ప్రయోగించమని చెప్పా రాజగోపాల్ రెడ్డికి. ఎమ్మెల్యే పదవి మునుగోడు ప్రజల ఆశీర్వాదంతోటి వచ్చింది.నీకు గౌరవం లేకపోతే మునుగోడు ప్రజలకు గౌరవం లేనట్టే. నువ్వు మంచిగా లేకపోతే వాళ్లు మంచిగా ఉన్నట్టు కాదు అని చెప్పాను. రాజీనామా పత్రాన్ని ముఖం మీద కొట్టి మీ చెంతకు చేరిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి ని ఆశీర్వదించాలి. సాయం చేసే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉన్న లేకపోయినా తన సొంత డబ్బులతో అనేక గ్రామాలకు మట్టి రోడ్లు వేయించిన ఘనత రాజగోపాల్ రెడ్డి ది' అని ఈటల కొనియాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని ఖతమైపోయిందన్నారు ఈటల రాజేందర్. మునుగోడు ప్రజల గుండెల్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారని స్పష్టం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల పైన దాడి చేస్తున్నారని విమర్శించారు. 31 తారీకు వరకు ఇబ్బంది పెడతారని... ఆ తర్వాత ఉండేది మునుగోడు ప్రజలే అని చెప్పారు. మీరే కథానాయకులై నడిపించాలని కోరారు.
బీజేపీ అంటేన అణగారిన వర్గాలకు అండగా ఉండే పార్టీ అని ఈటల చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గంలో కేవలం ముగ్గురు బీసీ మంత్రులుంటే... నరేంద్ర మోడీ నాయకత్వంలో 27 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. రాజగోపాల్ రెడ్డి గెలుపు రేపు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వానికి మలుపు అవుతుందన్నారు.