Congress On Munugodu : 5 నిమిషాల్లో రాజగోపాల్ రాజీనామా ఆమోదించడానికి రీజన్ అదే-congress meeting over munugode by election in gandhi bhavan hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Congress Meeting Over Munugode By Election In Gandhi Bhavan Hyderabad

Congress On Munugodu : 5 నిమిషాల్లో రాజగోపాల్ రాజీనామా ఆమోదించడానికి రీజన్ అదే

HT Telugu Desk HT Telugu
Aug 11, 2022 05:05 PM IST

మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోంది. గాంధీ భవన్ లో నేతలు సమావేశాలు నిర్వహిస్తూ.. ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు వేస్తోంది. తాజాగా గాంధీ భవన్లో ముఖ్యనేతలు సమావేశమయ్యారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను 5నిమిషాల్లో స్పీకర్‌ ఎలా ఆమోదిస్తారని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ అన్నారు. కేసిఆర్ దిల్లీ వెళ్లి రాగానే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం.. వెంటనే ఆమోదించటం కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ కీలక నేతలంతా కలిసి హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.

'టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఒప్పందం లేకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను 5 నిమిషాల్లో స్పీకర్‌ ఎలా ఆమోదిస్తారు. హుజురాబాద్‌ ఉపఎన్నిక టీఆర్ఎస్ అవసరమైతే.. మునుగోడులో ఎన్నిక బీజేపీ అవసరముంది. ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుంటున్నారు.' రేవంత్ రెడ్డి ఆరోపించారు.

బీజేపీ కుట్రలకు టీఆర్ఎస్ సహకరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ అన్నారు. రెండు పార్టీల కుట్రలో భాగంగానే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. మానిక్కమ్ ఠాగూర్ అధ్యక్షతన మునుగోడు ఉప ఎన్నికపై చర్చించామని చెప్పారు. ఈ నెల 13న మునుగోడులో పాద యాత్ర నిర్వహించి.. 16 నుంచి మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని మధుయాస్కీ అన్నారు. మునుగోడులోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ నేతల పాదయాత్రలుంటాయన్నారు.

ఆకస్మాత్తుగా మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చారని మధుయాస్కీ అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రమేయం లేకుండా వీళ్లే ఉపఎన్నిక తేదీ ప్రకటిస్తారన్నారు. టీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్​ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. అయినా మళ్లీ మునుగోడును నిలబెట్టుకుంటామన్నారు.

ఈ నెల 13వ తేదీన నారాయణపూర్‌ నుంచి చౌటుప్పల్‌ వరకు పాదయాత్ర ఉండనుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాస్కీ పాల్గొననున్నారు. ఈ నెల 16వ తేదీన నాంపల్లి, మర్రిగూడ మండలాలు, 18న చండూరు, మునుగోడు నాయకులతో భేటీ, 19 నారాయణపూర్‌, చౌటుప్పల్‌ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. అమిత్ షా వచ్చే రోజున భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించేలా కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోంది.

IPL_Entry_Point