Deer Death: రోడ్డు ప్రమాదంలో చుక్కల జింక మృతి
Deer Death: రోడ్డు ప్రమాదాల్లో, వన్యప్రాణులు మృతి చెందిన సంఘటనలు సంగారెడ్డి జిల్లాలో తరుచుగా జరుగుతున్నాయి.
Deer Death: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో తరచూ వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ నెలలో రేగోడ్ మండలంలో కృష్ణ జింక మృతి చెందిన ఘటన మరవక ముందే, సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఒక చుక్కల జింక మృతి చెందింది.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. మెదక్ జాతీయ రహదారి 765 డీ పై మంబాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మంగళవారం ఒక జింక రోడ్డు దాటుతుండగా అదే సమయంలో రోడ్డు పై వెళ్తున్న గుర్తు తెలియని వాహనం బలంగా డీకొట్టింది. దీంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది.
జింక మృతదేహాన్ని గమనించిన స్థానికులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి అటవీ శాఖ సిబ్బంది చేరుకొన్నారు. సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు సూచన మేరకు గుమ్మడిదల పశుసంవర్ధక శాఖ వైద్యులతో కలిసి జింక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి, అడవిలోకి తీసుకొనివెళ్లి దహనం చేశారు .
అటవీ ప్రాంతంలో తరచుగా జంతువులు తిరుగుతూ ఉంటాయి. కావున వాహనదారులు నెమ్మదిగా,చూసుకుంటూ వెళుతూ జంతువుల రక్షణకు తోడ్పాటుగా నిలవాలని అటవీ శాఖ అధికారులు వాహన చోదకులను కోరారు.
నిబంధనలు పాటించాలి: కలెక్టర్ రాజర్షిషా
జంతువులను హింసించడం, బాధించడం, బాధ కలిగేలా ప్రవర్తించడం శిక్షార్హమైన నేరమని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మెదక్ జిల్లాలో పెంపుడు జంతువుల సంతాన వృద్ధి, జంతువులను అమ్మే వ్యాపారం చేసే వారు తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ సంస్ధ అనుమతి తప్పనిసరిగా పొందాలని తెలిపారు.
జంతు హింసకు పాల్పడినా, వాటి ఆవాసాలను ధ్వంసం చేసినా, వాటి సంరక్షణకు సేవ చేస్తున్న వారిని అడ్డుకొని ఇబ్బందిపెట్టినా శిక్షార్హులని అయన అన్నారు.
జంతు సంక్షేమం కోసం ప్రతి పౌరుడు నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ-పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన గోడ ప్రతులను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ విజయ శేఖర్ రెడ్డి తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
జంతువుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అన్నారు. అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహజ పర్యావరణాన్ని రక్షించాలని, జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలని తెలిపారు. పశువులు, ఇతర జంతువులు, పక్షులను నిబంధనల మేరకు తరలించాలని, అక్రమ రవాణాకు పాల్పడితే శిక్షార్హులన్నారు.
ఆవులు, దూడలను వధించడం నిషేధించడం జరిగిందని, జంతువుల, ఆలయ ప్రాంగణాలు, ఇతర బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, కర్మాగారాలలో జంతువులు, పక్షులను బలి ఇవ్వడం నిషేధించడం జరిగిందని తెలిపారు.
వీధి కుక్కలు, పిల్లుల సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేసేందుకు మున్సిపల్, జంతు సంరక్షణ సంస్థలు విధిగా జాతీయ జంతు కళ్యాణ మండలి గుర్తింపు, అనుమతి పొందాలన్నారు.
జంతువుల అక్రమ రవాణా, అక్రమ వధ, జంతు సంరక్షణ కేంద్రాలలో హింసకు గురైన జంతువులు, పక్షులను సంబంధిత ప్రభుత్వ అధికారులు వాటిని సంరక్షణ కేంద్రాలకు పంపించేప్పుడు నిబంధనల మేరకు అర్హత కలిగిన సంస్థలకే ఇవ్వాలని తెలిపారు. పశువులు కోళ్ళు, కుక్కలతో పందాలు, పోటీలు నిర్వహించడం, పాల్గొనడం నేరమని తెలిపారు.