Virat Kohli Zaheer Khan: కోహ్లి.. నువ్వు నా కెరీర్ ముగించావ్ అని జహీర్ అన్నాడా?.. ఇషాంత్ కామెంట్స్‌పై జహీర్ రియాక్షన్
Virat Kohli Zaheer Khan: కోహ్లి.. నువ్వు నా కెరీర్ ముగించావ్ అని జహీర్ అన్నాడా? ఇషాంత్ శర్మ చేసిన సెన్సేషనల్ కామెంట్స్‌పై జహీర్ ఖాన్ స్పందించాడు. అసలు ఆ మ్యాచ్ లో ఏం జరిగిందో వెల్లడించాడు.
Virat Kohli Zaheer Khan: ఇండియన్ క్రికెట్ టీమ్ లో తెర వెనుక జరిగిన ఘటనల గురించి అభిమానులు ఆసక్తిగా చూస్తారు. అలాంటి ఎవరికీ తెలియని ఓ తెర వెనుక స్టోరీని పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ వెల్లడించాడు. ఇండియా, వెస్టిండీస్ రెండో టెస్ట్ వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యం కాకపోవడంతో జియో సినిమాలో అతడు మాట్లాడుతూ 9 ఏళ్ల కిందట జరిగిన ఓ ఘటన గురించి వివరించాడు.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ మధ్య జరిగిన సంభాషణ అది. ఆ సమయంలో పక్కనే జహీర్ కూడా ఉన్నాడు. ఇది 2014లో జరిగింది. అప్పుడు టీమిండియా.. న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఆ టూర్ రెండో టెస్ట్ లో కోహ్లి క్యాచ్ డ్రాప్ చేయడం, తర్వాత జరిగిన ఘటనల గురించి ఇషాంత్ చెప్పుకొచ్చాడు. అప్పటి న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ క్యాచ్ అది. ఆ క్యాచ్ డ్రాపయిన తర్వాత మెకల్లమ్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేశాడు.
"మేము న్యూజిలాండ్ లో ఆడుతున్నాం. విరాట్ కోహ్లి క్యాచ్ డ్రాప్ చేశాడు. తర్వాత బ్రెండన్ మెకల్లమ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఇది లంచ్ సమయంలో జరిగినట్లు నాకు గుర్తుంది. జహీర్ కు విరాట్ సారీ చెప్పాడు. దానికి జహీర్ స్పందిస్తూ.. ఏం కాదులే అతన్ని ఔట్ చేద్దామని అన్నాడు. టీ సమయంలో విరాట్ మళ్లీ సారీ చెప్పాడు. అప్పుడు కూడా ఏం కాదులే అని జహీర్ అన్నాడు. మూడో రోజు టీ సమయంలోనూ విరాట్ సారీ చెప్పాడు.అప్పుడు జహీర్ అతనితో నువ్వు నా కెరీర్ ముగించావ్ అని అన్నాడు" అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.
అప్పుడు పక్కనే ఉన్న జహీర్ స్పందిస్తూ.. తాను అలా అనలేదని, అసలు ఏం జరిగిందో వివరించాడు. "నేను ఆ మాట అనలేదు. ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత ట్రిపుల్ సెంచరీలు చేశారని చెప్పాను. కిరణ్ మోరె క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత గ్రాహమ్ గూచ్, విరాట్ క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత మెకల్లమ్ ట్రిపుల్ సెంచరీలు చేశారని అన్నాను. తనతో అలా మాట్లాడొద్దని విరాట్ అన్నాడు. సహజంగానే కోహ్లి బాధలో ఉన్నాడు. క్యాచ్ డ్రాపయింది.. భారీగా పరుగులు వచ్చాయి" అని జహీర్ చెప్పాడు.
ఆ మ్యాచ్ లో మెకల్లమ్ ఏకంగా 302 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ మొదట్లోనే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మెకల్లమ్ దానిని సద్వినియోగం చేసుకున్నాడు. అదే ఇన్నింగ్స్ లో జహీర్ ఖాన్ కూడా ఐదు వికెట్లు తీసుకోవడం విశేషం. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇండియా తరఫున తొలి ఇన్నింగ్స్ లో రహానే, రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లి సెంచరీలు చేశారు.
సంబంధిత కథనం