Zaheer warning Team India: 2019లోనూ ఇదే సమస్య ఎదురైంది.. టీమిండియా ప్రపంచకప్ సన్నాహంపై జహీర్ రియాక్షన్-zaheer khan says team india in the same boat as in the 2019 odi world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Zaheer Warning Team India: 2019లోనూ ఇదే సమస్య ఎదురైంది.. టీమిండియా ప్రపంచకప్ సన్నాహంపై జహీర్ రియాక్షన్

Zaheer warning Team India: 2019లోనూ ఇదే సమస్య ఎదురైంది.. టీమిండియా ప్రపంచకప్ సన్నాహంపై జహీర్ రియాక్షన్

Maragani Govardhan HT Telugu
Mar 25, 2023 03:10 PM IST

Zaheer warning Team India: ప్రస్తుతం టీమిండియాలో వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాలుగో స్థానంలో సరైన ప్లేయర్‌ను గుర్తించలేకపోతుంది. నిలకడగా ఆడుతున్న శ్రేయాస్ గాయపడటంతో ఆ స్థానంలో సూర్యకుమార్ విఫలమయ్యాడు. ఈ విషయంపై స్పందించిన జహీర్ ఖాన్.. 2019లోనూ ఇదే సమస్య ఎదురైందని చెప్పాడు.

జహీర్ ఖాన్
జహీర్ ఖాన్

Zaheer warning Team India: నాలుగేళ్ల క్రితం 2019 వరల్డ్ కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్ చేజిలో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి ఎలాగైనా సత్తాచాటి మూడో సారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని చూస్తోంది. అక్టోబరు-నవంబరు మాసాల్లో మళ్లీ వరల్డ్ కప్ రానున్న తరుణంలో జట్టులో కీలక ఆటగాళ్లు గాయాలపాలవడం టీమిండియాను కలవరపెడుతోంది. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఆడించడానికి మెరుగైన ప్లేయర్‌ను గుర్తించలేకపోతుంది. ఈ స్థానంలో శ్రేయాస్ నిలకడగా ఆడినా.. అతడు గాయపడటం ఇప్పుడు జట్టులో కొత్త సమస్యలను తీసుకొచ్చింది. ఈ విషయంపై టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. 2019లోనూ భారత్ ఇలాంటి సమస్యే ఎదుర్కొందని అన్నాడు.

"బ్యాటింగ్ ఆర్డర్‌పై కచ్చితంగా మరోసారి సమీక్షించుకోవాలి. నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్‌ను గుర్తించాలి. ఇదే సమస్య 2019 ప్రపంచకప్ సమయంలోనూ ఎదురైంది. నాలుగేళ్ల తర్వాత కూడా మనం అదే సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం. నాలుగో స్థానంలో ఆడేంచేందుకు శ్రేయాస్ అయ్యర్‌ను గుర్తించారని నాకు తెలుసు. ఆ స్థానంలో అతడు తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. కానీ ఇప్పుడు శ్రేయాస్ గాయపడ్డాడు. ఒకవేళ అతడు దీర్ఘకాలం పాటు గాయం నుంచి కోలుకోకపోతే ఈ సమస్య నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలను వెతకాల్సి ఉంటుంది." అని జహీర్ ఖాన్ అన్నాడు.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ గాయపడటంతో అతడి స్థానంలో వచ్చిన సూర్యకుమార్ వన్డేల్లో పెద్దగా రాణించలేదు. మూడో వన్డేలో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆష్టన్ ఆగర్ వేసిన 36వ ఓవర్లో అతడు తను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో, విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ ఎల్బీడబ్ల్యూ ట్రాప్‌లో సూర్యకుమార్ ఇరుక్కోగా.. మూడో వన్డేలో మాత్రం ఆష్టన్ అగర్ స్పిన్ మాయాజలానికి పెవిలియన్ చేరాడు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన దృష్టంతా ఐపీఎల్‌పైనే పెట్టాడు. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 కోసం సిద్ధమవుతున్నాడు. ముంబయి ఇండియన్స్ తరఫున అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2018 నుంచి ముంబయి తరఫున ఆడుతున్న అతడు ఆ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. రోహిత్ శర్మ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Whats_app_banner