Virat Kohli: ధోనీపై విరాట్‌ కోహ్లి ట్వీట్.. బ్రేక్‌ అవుతున్న ఇంటర్నెట్‌-virat kohli tweet about ms dhoni breaking the internet ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli: ధోనీపై విరాట్‌ కోహ్లి ట్వీట్.. బ్రేక్‌ అవుతున్న ఇంటర్నెట్‌

Virat Kohli: ధోనీపై విరాట్‌ కోహ్లి ట్వీట్.. బ్రేక్‌ అవుతున్న ఇంటర్నెట్‌

Hari Prasad S HT Telugu
Aug 26, 2022 09:57 AM IST

Virat Kohli: ధోనీపై విరాట్‌ కోహ్లి చేసిన ట్వీట్‌ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌ను బ్రేక్‌ చేస్తోంది. ఆసియా కప్‌ 2022 ప్రారంభానికి ముందు ఆగస్ట్‌ 25వ తేదీని గుర్తు చేసుకుంటూ కోహ్లి ఈ ట్వీట్‌ చేయడం మరింత ఆసక్తి రేపుతోంది.

విరాట్ కోహ్లి తన ట్వీట్ లో పోస్ట్ చేసిన ఫొటో ఇదే
విరాట్ కోహ్లి తన ట్వీట్ లో పోస్ట్ చేసిన ఫొటో ఇదే (Twitter/imvKohli)

Virat Kohli: ఇండియన్‌ క్రికెట్‌పై మాజీ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీ ముద్ర ఎవరూ చెరిపివేయలేనిది. ఓ వికెట్‌ కీపర్‌గా, ఫినిషర్‌గా, అన్నింటికీ మించి గొప్ప కెప్టెన్‌గా ఇండియన్‌ టీమ్‌లో అతను ఎవరికీ సాధ్యం కాని ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఓ గవాస్కర్‌, కపిల్‌దేవ్‌, సచిన్‌ టెండూల్కర్‌ల స్థాయి అతనిది. వీళ్ల తర్వాత ఇండియన్‌ క్రికెట్‌పై ఆ స్థాయిలో ప్రభావం చూపింది విరాట్‌ కోహ్లియే.

కోహ్లి ఎంత ఎత్తుకు ఎదిగినా.. ధోనీ తనకు చేసిన మేలుని, అతనితో ఉన్న బంధాన్ని మాత్రం మరవలేదు. వీలున్నప్పుడల్లా గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. తాజాగా ఆసియా కప్‌ కోసం సిద్ధమవుతున్న అతడు.. గురువారం (ఆగస్ట్‌ 25) ధోనీని ఉద్దేశించి చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ధోనీ జెర్సీ నంబర్‌ 7, కోహ్లి జెర్సీ నంబర్‌ 18. ఈ రెండూ కలిపితే 25.

అందుకే అదే 25వ తేదీన తమ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని విరాట్ గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్‌లో ధోనీతో కలిసి ఆడిన సమయమే చాలా ఎంజాయ్‌ చేసిన, ఉత్సాహంగా గడిచిన కాలమని విరాట్‌ అనడం విశేషం. చాలా కాలం పాటు అతడు ధోనీకి డిప్యూటీగా ఉన్న విషయం తెలిసిందే. అన్ని ఫార్మాట్లలోనూ ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో విరాట్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

2014లో టెస్ట్‌ కెప్టెన్సీ, 2017లో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని ధోనీ నుంచి కోహ్లి అందుకున్నాడు. తన తాజా ట్వీట్‌లో ధోనీ గురించి రాస్తూ.. "ఈ మనిషి నమ్మకమైన డిప్యూటీగా ఉన్న రోజులే నా కెరీర్‌లో బాగా ఎంజాయ్‌ చేసిన, ఉత్సాహంగా గడిపిన రోజులు. మా పార్ట్‌నర్‌షిప్‌ నాకు ఎప్పుడూ స్పెషలే. 7+18" అంటూ చివర్లో హార్ట్‌ ఎమోజీని కోహ్లి పోస్ట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. అప్పటి నుంచీ కొన్ని లక్షల లైక్స్‌, వేల రీట్వీట్స్ వచ్చాయి. ఈ ట్వీట్‌తోపాటు కోహ్లి యాడ్‌ చేసిన ఫొటో 2016 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా తీసినది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 51 బాల్స్‌లోనే 82 రన్స్‌ చేసి టీమ్ను 6 వికెట్లతో గెలిపించాడు. ఈ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో ధోనీ నడుచుకుంటూ వెళ్లడం చూడొచ్చు. తమ కెరీర్‌లో ఈ ఇద్దరి మధ్య ఎన్నో మరుపురాని పార్ట్‌నర్‌షిప్‌లు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం