Virat Kohli injured: విరాట్ కోహ్లికి గాయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాడా.. కోచ్ ఏమన్నాడంటే?
Virat Kohli injured: విరాట్ కోహ్లికి గాయమైంది. దీంతో అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాడా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగార్ స్పందించాడు.
Virat Kohli injured: ఐపీఎల్ 2023లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరకపోయినా.. విరాట్ కోహ్లి మాత్రం మరోసారి ఈ సీజన్ ను మరుపురాని జ్ఞాపకంగా మార్చుకున్నాడు. వరుసగా రెండు సెంచరీలతో సీజన్ ముగించాడు. అయితే చివరి మ్యాచ్ లో అతని సెంచరీ ఆర్సీబీని గెలిపించలేకపోగా.. ఇదే మ్యాచ్ లో అతడు గాయపడ్డాడు. కోహ్లి మోకాలికి గాయమైంది.
అయితే ఈ గాయం అతన్ని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు కూడా దూరం చేస్తుందా అన్న ఆందోళన కలుగుతోంది. జూన్ 7 నుంచి ఇంగ్లండ్ లో ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ విరాట్ కోహ్లి మోకాలి గాయం బారిన పడ్డాడు. ఈ గాయం తర్వాత అతడు మళ్లీ ఫీల్డింగ్ చేయలేదు.
తాజాగా అతని గాయం తీవ్రత గురించి ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగార్ వెల్లడించాడు. కోహ్లి గాయం మరీ అంత తీవ్రంగా ఏమీ లేదని, ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. "అవును, కోహ్లి మోకాలికి కాస్త గాయమైంది. కానీ నాకు తెలిసి మరీ అంత తీవ్రమైన గాయం ఏమీ కాదు. నాలుగు రోజుల వ్యవధిలో అతడు రెండు వరుస సెంచరీలు చేశాడు.
బ్యాట్ తోనే కాదు ఫీల్డింగ్ లోనూ తన మార్క్ చూపించడానికి అతడు ఉత్సాహం చూపుతాడు. చాలా పరుగెత్తాడు కూడా. రెండు రోజుల కిందట 40 ఓవర్ల పాటు, ఇవాళ 35 ఓవర్ల పాటు ఫీల్డ్ లోనే ఉన్నాడు. అతడు తన అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తున్నాడు. ఇలా జరగడం సహజమే కానీ అది అంత సీరియస్ అయితే కాదు" అని సంజయ్ బంగార్ తేల్చి చెప్పాడు.
ఐపీఎల్లో సన్ రైజర్స్, గుజరాత్ టైటన్స్ లపై అతడు రెండు వరుస సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. సన్ రైజర్స్ పై చేజింగ్ లో సెంచరీతో టీమ్ ను గెలిపించినా.. గుజరాత్ పై ఓటమి తప్పలేదు. చివర్లో గిల్ విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత అతనిలో నిరాశ స్పష్టంగా కనిపించింది. అతడు ఎంతో చిరాకుగా చేతిలోని వాటర్ బాటిల్ ను విసిరి కొట్టాడు.
సంబంధిత కథనం