Shubhman Gill : శుభ్‌మన్ గిల్‌పై దిగ్గజ క్రికెటర్ల ప్రశంసలు-ipl 2023 gt vs mi shubman gill century virat kohli yuvraj singh and virender sehwag praises young opener ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shubhman Gill : శుభ్‌మన్ గిల్‌పై దిగ్గజ క్రికెటర్ల ప్రశంసలు

Shubhman Gill : శుభ్‌మన్ గిల్‌పై దిగ్గజ క్రికెటర్ల ప్రశంసలు

HT Telugu Desk HT Telugu
May 27, 2023 08:01 AM IST

Shubhman Gill : ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై శుభ్‌మన్ గిల్ రెచ్చిపోయాడు. కేవలం 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఈ కీలక మ్యాచ్‌లో గిల్ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ 233 పరుగులు చేసింది.

శుభ్‌మాన్ గిల్‌
శుభ్‌మాన్ గిల్‌ (Twitter)

ముంబైతో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఆటతీరును క్రికెట్ అభిమానులే కాకుండా దిగ్గజ క్రికెటర్లు సైతం ప్రశంసిస్తున్నారు. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ గిల్ ఆటతీరును మెచ్చుకున్నారు. విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో శుభ్‌మన్ గిల్ ఫోటోను షేర్ చేసి స్టార్ ఎమోజీని ఉపయోగించి పోస్ట్ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా గిల్ ఆటను మెచ్చుకున్నాడు. గిల్ నుండి మరో అద్భుతమైన ఇన్నింగ్స్‌ అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం లభించింది. శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత సాయి సుదర్శన్‌తో కలిసి శుభ్‌మన్‌ గిల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ పూర్తి చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లందరిపై శుభ్‌మన్ గిల్ ఎదురుదాడి చేశాడు. నరేంద్ర మోదీ స్టేడియంలోని ప్రతి మూలకు బంతిని కొట్టాడు. ఈ IPL టోర్నమెంట్‌లో తన మూడో సెంచరీని పూర్తి చేశాడు.

శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో 60 బంతులు ఎదుర్కొన్న గిల్ 129 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లో 10 భారీ సిక్సర్లు, 7 బౌండరీలు ఉన్నాయి. 215 స్ట్రైక్ రేట్ తో ప్రత్యర్థి బౌలర్లకు షాకిచ్చాడు.

తర్వాత సాయి సుదర్శన్ 31 బంతుల్లో 43 పరుగులతో రిటైర్ హర్ట్ అయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 28 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబయి జట్టు లక్ష్యాన్ని చేరుకోలేక ఆలౌట్ అయింది. దీంతో ఫైనల్ మ్యాచ్ లో చెన్నైతో తలపడనుంది గుజరాత్ జట్టు.

గుజరాత్ టైటాన్స్ జట్టు : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.

Whats_app_banner