Harbhajan on Gill: టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గిల్: హర్భజన్ సింగ్
Harbhajan on Gill: టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గిల్ అంటూ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు గిల్ తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వస్తాడని కూడా జోస్యం చెప్పాడు.
Harbhajan on Gill: ఇండియన్ క్రికెట్ లో సచిన్, కోహ్లి తర్వాత ఆ స్థాయిలో వినిపిస్తున్న పేరు శుభ్‌మన్ గిల్. ఏడాది కాలంగా అతని ఆటతీరు ఎంతోమందిని ఆకర్షిస్తోంది. తాజాగా ఐపీఎల్లోనూ గిల్ రెండు సెంచరీలు బాదాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గిల్ భవిష్యత్తు కెప్టెన్ అంటూ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కామెంట్ చేయడం విశేషం.
ట్రెండింగ్ వార్తలు
ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్ తో ఇండియన్ క్రికెట్ భవిష్యత్తు చాలా మెరుగ్గా ఉండబోతోందని భజ్జీ అన్నాడు. ఈ ఐపీఎల్లో రాణించిన యశస్వి జైస్వాల్ కూడా త్వరలోనే నేషనల్ టీమ్ కు ఆడతాడని కూడా అతడు స్పష్టం చేశాడు. "బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడుకుంటే, శుభ్‌మన్ గిల్ కు ఆ సామర్థ్యం ఉంది. అతనితోపాటు యశస్వి కూడా ఇండియా భవిష్యత్ కెప్టెన్ అయ్యే సమర్థుడు.
ఈ ఏడాది బాగా ఆకట్టుకున్న ప్లేయర్ యశస్వి జైస్వాల్. రానున్న రోజుల్లో అతడు కచ్చితంగా టీమిండియాకు ఆడతాడు. గిల్ ఎలాగూ ఉంటాడు. అతడు కెప్టెన్ కూడా కావచ్చు" అని హర్భజన్ అన్నాడు.
ఐపీఎల్ 2023లో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ప్లేయర్స్ ఎంతో మంది రాణించారు. యశస్వి, రింకు సింగ్, జితేష్ శర్మ, తిలక్ వర్మలాంటి వాళ్లు సత్తా చాటారు. "ప్రస్తుత ఫామ్ చూసుకుంటే, యువకులకు అవకాశం ఇవ్వాలంటే అందుబాటులో ఉన్న వాళ్లలో యశస్వి మంచి ఆప్షన్.
గతేడాది టీ20 వరల్డ్ కప్ లో ఓడిపోయినప్పుడు యువకులతో టీమ్ తయారు చేయాలని అన్నారు. నా వరకూ ఎవరిని తీసేయాలన్నది చెప్పను కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో యశస్వి జైస్వాల్, రింకు సింగ్, శుభ్‌మన్ గిల్ ఆడితే మొత్తంగా ఓ కొత్త టీమ్ రూపొందుతుంది" అని హర్భజన్ అన్నాడు.
రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవాలని కూడా భజ్జీ స్పష్టం చేశాడు. అలా అయితేనే ఓ తాజాగా టీమ్ తయారవుతుందని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ కెప్టెన్సీలో యశస్వి, గిల్ ఓపెనింగ్ చేయాలని.. రుతురాజ్, రింకు, తిలక్ వర్మ, నితీష్ రాణా లాంటి వాళ్లతో టీమ్ తయారు చేస్తే బాగుంటుందని అన్నాడు.
సంబంధిత కథనం