Fans on Babar Azam: బాబర్ కాస్త స్పీడు తగ్గించు.. పాకిస్థాన్ కెప్టెన్‌కు క్లాస్ పీకిన ఫ్యాన్స్.. ఇదీ కారణం
Fans on Babar Azam: బాబర్ కాస్త స్పీడు తగ్గించు అంటూ పాకిస్థాన్ కెప్టెన్‌కు క్లాస్ పీకారు అక్కడి ఫ్యాన్స్. బైకుపై అతడు చాలా వేగంగా వెళ్తున్న వీడియో చూసిన అభిమానులు ఇలా రియాక్టయ్యారు.
Fans on Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజంకు అక్కడి అభిమానులు క్లాస్ పీకుతున్నారు. దీని వెనుక బలమైన కారణం లేకపోలేదు. అతడు ఈ మధ్య తన ఖరీదైన బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ బైకుపై లాహోర్ రోడ్లపై వేగంగా వెళ్తున్న వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను బాబరే తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. రెడీ సెట్ గో అనే క్యాప్షన్ తో ఈ వీడియోను అతడు అభిమానులతో పంచుకున్నాడు.
తన స్పీడు చూసి ఫ్యాన్స్ ఈ వీడియోను విపరీతంగా లైక్ చేస్తారని బాబర్ భావించినా.. అది కాస్తా రివర్సయింది. కొందరు అభిమానులు ఈ వీడియో చూసి ఆందోళనకు గురయ్యారు. పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా, ప్రధాన ప్లేయర్ గా ఆ టీమ్ విజయాల్లో బాబర్ దే కీలకపాత్ర. అలాంటి ప్లేయర్ కు ఇలాంటి సాహసాలు చేసే సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా అన్నది అభిమానుల ఆందోళనగా కనిపిస్తోంది.
అసలు ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కూడా జరగనున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చేయడం ఎంత వరకూ కరెక్ట్ అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఏమాత్రం బాధ్యత లేదా అని కూడా నిలదీస్తున్నారు. ముఖ్యంగా గతేడాది డిసెంబర్ లో రిషబ్ పంత్ ఇలాగే కారు ప్రమాదానికి గురై ఆరు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న నేపథ్యంలో బాబర్ బైక్ నడపడం చూసి అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు.
పంత్ ను చూసైనా ఇలాంటి సాహసాలు మానుకో అంటూ బాబర్ కు సూచిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 30న పంత్ తానే కారును వేగంగా డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. ఈ ఏడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్, ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ కు కూడా దూరమయ్యాడు.
ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్ చేస్తున్నాడు. అతనికి మరో సర్జరీ కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్, వరల్డ్ కప్ లకు కూడా పంత్ దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
సంబంధిత కథనం