Babar Azam Record: బాబర్ ఆజమ్ అరుదైన ఘనత.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాక్ కెప్టెన్
Babar Azam Record: బాబర్ ఆజమ్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో వేగంగా 5 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి హషీమ్ ఆమ్లా(101 ఇన్నింగ్స్‌లు), కోహ్లీ(114 ఇన్నింగ్స్‌లు)లను అధిగమించాడు.
Babar Azam Record: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ యువ బ్యాటర్.. తాజాగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 97 ఇన్నింగ్స్‌ల్లో బాబర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇంతకుముందు వేగంగా 5 వేల పరుగులను సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. అతడు 101 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. కానీ బాబర్ 97 ఇన్నింగ్స్‌ల్లోనే అధిగమించడం విశేషం.
న్యూజిలాండ్‌తో శుక్రవారం జరుగుతున్న నాలుగో వన్డేలో 19 పరుగుల వద్ద బాబర్ 5 వేల పరుగుల మార్కును అదిగమించాడు. గతేడాది ఆమ్లా పేరిటే ఉన్న వేగవంతమైన 4 వేల పరుగుల రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ఆమ్లా 81 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధిస్తే.. బాబర్‌కు 82 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
బాబర్ అత్యంత వేగంగా 5 వేల పరుగుల రికార్డును 97 ఇన్నింగ్స్‌ల్లో సాధిస్తే.. ఆమ్లా 101, కోహ్లీ 114, వివ్ రిచర్డ్స్ 114 ఇన్నింగ్స్‌ల్లో సాధించారు. దీంతో బాబర్ ఆమ్లా, కోహ్లీ రికార్డులను అధిగమించినట్లయింది. వీరి తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 115 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును అందిపుచ్చుకున్నాడు.
గత రెండేళ్లుగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బాబర్ ఆజమ్.. 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న 14వ పాకిస్థానీ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 97 ఇన్నింగ్స్‌ల్లో 60.31 సగటుతో 5066 పరుగులతో కొనసాగుతున్నాడు బాబర్. ఇందులో 17 సెంచరీలు 27 అర్ధశతకాలు ఉన్నాయి.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో పాకిస్థాన్ 41 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 245 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. బాబర్ ఆజమ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. న్యూజిలాండ్‌పై ఇప్పటికే ఐదు వన్డేల సిరీస్‌లో 3-0తో సిరీస్ సొంతం చేసుకున్న పాక్.. క్లీన్ స్వీప్‌పై దృష్టి పెట్టింది.