Harbhajan on Siraj: సిరాజ్‌ను మించిన బౌలర్.. ధోనీని మించిన క్రికెటర్ ఎవరూ లేరు: హర్భజన్
Harbhajan on Siraj: సిరాజ్‌ను మించిన బౌలర్.. ధోనీని మించిన క్రికెటర్ ఎవరూ లేరు అంటూ హర్భజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గురువారం (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సిరాజ్ బౌలింగ్ చేసిన తీరు అభిమానుల ఆకర్షించింది.
Harbhajan on Siraj: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో సిరాజ్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేస్తున్న మరో బౌలర్.. ఇండియాలో ధోనీ స్థాయిని మించిన క్రికెటర్ మరెవరూ లేరని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఐపీఎల్లో భాగంగా గురువారం (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో సిరాజ్ నాలుగు వికెట్లతో ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో మ్యాచ్ తర్వాత సిరాజ్ బౌలింగ్ పై భజ్జీ స్పందిస్తూ.. అతన్ని ఆకాశానికెత్తాడు. లాక్‌డౌన్ లో తాను పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం కనిపిస్తోందని మ్యాచ్ తర్వాత సిరాజ్ కూడా చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా హర్భజన్ స్పందిస్తూ.. సిరాజ్ లాగా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్న మరో బౌలర్ లేడని అన్నాడు.
"మహ్మద్ సిరాజ్ సెన్సేషనల్ గా బౌలింగ్ చేస్తున్నాడు. అతని లైన్, లెంత్ అద్భుతం. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అతని కంటే మెరుగ్గా బౌలింగ్ చేస్తున్న వాళ్లు మరొకరు లేరు. గతేడాది సిరాజ్ కు ఇప్పటి సిరాజ్ కు చాలా తేడా కనిపిస్తోంది. అతడు రన్స్ ఇవ్వడం లేదు. పైగా వికెట్లు కూడా తీసుకుంటున్నాడు. బ్యాటర్లను భయపెడుతున్నాడు" అని భజ్జీ అనడం విశేషం.
ఇక ఈ సందర్భంగానే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపైనా హర్భజన్ ప్రశంసలు కురిపించాడు. ఇండియాలో ధోనీ ఒక్కడే అని, అతన్ని మించిన క్రికెటర్ మరొకరు లేరు అని భజ్జీ స్పష్టం చేశాడు.
"ఒకే ఒక్కడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇండియాలో అతన్ని మించిన క్రికెటర్ లేడు. కొందరు అతని కంటే ఎక్కువ రన్స్ చేసి ఉండొచ్చు. మరికొందరు ఎక్కువ వికెట్లు తీసి ఉండొచ్చు. కానీ ధోనీ కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎవరికీ లేదు. ధోనీ ఈ క్రేజ్ ను తన గుండెల్లో పెట్టుకున్నాడు. తన టీమ్మేట్స్ ను చాలా గౌరవిస్తాడు.
అతని స్థానంలో మరెవరు ఉన్నా తట్టుకోలేకపోయేవాళ్లు. కానీ ధోనీ ఈ ప్రేమ, భావోద్వేగాలను 15 ఏళ్లుగా తన గుండెల్లో పెట్టుకున్నాడు. ఇప్పటికీ ఏమాత్రం మారలేదు" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ భజ్జీ అన్నాడు.
సంబంధిత కథనం