Twitter blue tick: సచిన్, ధోనీ, కోహ్లిలకూ ట్విటర్ బ్లూ టిక్ పోయింది.. ఇదీ కారణం
Twitter blue tick: సచిన్, ధోనీ, కోహ్లిలకూ ట్విటర్ బ్లూ టిక్ పోయింది. ఇది చూసిన అభిమానులు షాక్ తింటున్నారు. గురువారం (ఏప్రిల్ 20) ఈ టాప్ క్రికెటర్ల అకౌంట్ల నుంచి బ్లూ టిక్ కనిపించకుండా పోయింది.
Twitter blue tick: ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లలో ప్రముఖుల పేర్ల మీద ఎన్నో అకౌంట్లు క్రియేట్ అవుతూ ఉంటాయి. వీటిలో ఒరిజినల్ ఏదో కనిపెట్టడానికి వచ్చిందే బ్లూటిక్. సెలబ్రిటీలకు ప్రత్యేకంగా దీనిని కేటాయించడం వల్ల అభిమానులకు ఒరిజినల్ ఏదో తెలిసేది. ట్విటర్ లోనూ ఈ బ్లూక్ అందరు సెలబ్రిటీలకూ ఉంది.
కానీ తాజాగా గురువారం (ఏప్రిల్ 20) కొందరు టాప్ క్రికెటర్లు ఈ బ్లూ టిక్ కోల్పోయారు. వీళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు మాజీ కెప్టెన్లు సచిన్, ధోనీ, కోహ్లిలు కూడా ఉన్నారు. ఈ ట్విటర్ సంస్థను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నప్పటి నుంచీ ఈ బ్లూ టిక్స్ ప్రక్షాళన చేసే పని చేపడుతోంది ఆ సంస్థ. అంతేకాదు ఈ బ్లూటిక్ కావాలంటే ఏడాదికి 8 డాలర్లు చెల్లించాలన్న నిబంధన కూడా పెట్టారు.
దీంతో చాలా మంది ఈ లెగసీ వెరిఫైడ్ టిక్స్ ను కోల్పోయారు. తాజాగా ఇండియన్ టాప్ క్రికెటర్లు కూడా ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీజు కట్టకపోవడం వల్లే తమ వెరిఫైడ్ టిక్ కోల్పోవడం గమనార్హం. ఇండియన్ క్రికెటర్లే కాదు.. టాప్ ఫుట్‌బాలర్ అయిన క్రిస్టియానో రొనాల్డో కూడా ట్విటర్ లో తన బ్లూ టిక్ కోల్పోయాడు. దీంతో ఇక నుంచి వీళ్ల అసలు అకౌంట్లు ఏవో తెలుసుకోవడం అభిమానులకు కష్టంగా మారనుంది.
ట్విటర్ సంస్థను కొనుగోలు చేసినప్పటి నుంచీ మస్క్ ఎన్నో మార్పులూ చేస్తూ వస్తున్నారు. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. చివరికి ఈ వెరిఫైడ్ టిక్ ను కూడా ఆదాయ మార్గంగా చేసేశారు. ఎంతటి సెలబ్రిటీలు అయినా.. నెలవారీ 8 డాలర్లు చెల్లించకపోతే వెరిఫైడ్ టిక్ తొలగిస్తున్నారు. ఇప్పుడు క్రికెటర్లు కూడా అలాగే ఈ బ్లూ టిక్ కోల్పోయారు.
సంబంధిత కథనం