Gavaskar on Axar Patel: వార్నర్‌ను పక్కన పెట్టి అక్షర్‌కు కెప్టెన్సీ ఇవ్వండి: గవాస్కర్
Gavaskar on Axar Patel: వార్నర్‌ను పక్కన పెట్టి అక్షర్‌కు కెప్టెన్సీ ఇవ్వండి అని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కు సలహా ఇచ్చాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. అది టీమిండియాకు కూడా మేలు చేస్తుందని అతడు అనడం గమనార్హం.
Gavaskar on Axar Patel: ఇండియన్ టీమ్ లోనే కాదు ఇప్పుడు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు కూడా విజయాలు సాధించి పెడుతున్నాడు అక్షర్ పటేల్. సోమవారం (ఏప్రిల్ 24) సన్ రైజర్స్ హైదరాబాద్ లో మ్యాచ్ లోనూ అతడు ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. మొదట 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమ్ ను బ్యాట్ తో ఆదుకున్నాడు. 34 బంతుల్లో 34 రన్స్ చేశాడు.
తర్వాత బౌలింగ్ లోనూ 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయడంతో సన్ రైజర్స్ పై డీసీ 7 పరుగులతో గెలిచింది. అక్షర్ ప్లేయర్ ఆఫ ద మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో అక్షర్ పర్ఫార్మెన్స్ చూసిన మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. డీసీకి ఓ కీలకమైన సూచన చేశాడు. అసలు టీమ్ కెప్టెన్సీని అక్షర్ కే ఇవ్వాలని సన్నీ సూచించడం గమనార్హం.
ఇది భవిష్యత్తులో టీమిండియాకూ మేలు చేస్తుందని అతడు అన్నాడు. "ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ను నియమించాలి. అతడో నిజాయతీ గల ప్లేయర్. మంచి రిథమ్ లో ఉన్నాడు. అతన్ని ఫ్రాంఛైజీ కెప్టెన్ గా చేసి, బాగా రాణించగలిగితే టీమిండియాకూ మేలు జరుగుతుంది. దీర్ఘకాలంగా ఈ పని చేయాలి" అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ లో గవాస్కర్ అన్నాడు.
ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యధిక రన్స్, అత్యధిక వికెట్లు తీసిన వాళ్లలో రెండోస్థానంలో అక్షర్ ఉన్నాడు. అతడు ఏడు మ్యాచ్ లలో ఆరు వికెట్లు తీయడంతోపాటు 182 రన్స్ కూడా చేశాడు. సన్ రైజర్స్ పై విజయంలో కీలకపాత్ర పోషించిన తర్వాత మాట్లాడిన అక్షర్.. తన బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ బాగా ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు.
డీసీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తాను కాఫీ ఆర్డర్ చేశానని, ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడటంతో ఆ కప్పు అలాగే వదిలేసి బ్యాటింగ్ కు వెళ్లినట్లు చెప్పాడు. సాధ్యమైనంత వరకూ చివరి దాకా క్రీజులో ఉండాలని మనీష్ పాండే, తాను అనుకున్నట్లు తెలిపాడు. ఈ సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్ లు ఓడిన డీసీ.. తర్వాత రెండు వరుస విజయాలు సాధించింది.
సంబంధిత కథనం