SRH vs DC: ఇదేం బ్యాటింగ్? ఈజీ టార్గెట్ ఛేదించలేకపోయారు - ఢిల్లీ చేతిలో సన్‌రైజర్స్ ఓటమి
SRH vs DC: మరోసారి పేలవ బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశపరిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
SRH vs DC: సన్‌రైజర్స్ టార్గెట్ 145 రన్స్. టీమ్‌లో భారీ హిట్టర్లు ఉన్నారు. ఈ టార్గెట్ ఈజీగా ఛేజింగ్ చేస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ తమ పేలవ బ్యాటింగ్‌తో ఓటమి పాలై విమర్శలకు గురవుతోన్నారు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో సన్‌రైజర్స్ ఏడు పరుగులు తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఇరవై ఓవర్లలో 144 పరుగులు చేసింది.
సన్‌రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్ విజృంభణతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. అక్షర్ పటేల్ (34 రన్స్), మనీష్ పాండే (34 రన్స్)తో రాణించడంతో ఢిల్లీ ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ నాలుగు ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.
సింపుల్ టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 137 పరుగులు మాత్రమే చేసింది. హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మతో పాటు కెప్టెన్ మార్‌క్రమ్ దారుణంగా విఫలమయ్యారు. మయాంక్ అగర్వాల్ 39 బాల్స్‌లో ఏడు ఫోర్లతో 49 రన్స్ చేశాడు.
క్లాసెన్ 19 బాల్స్‌లో ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 31 రన్స్ చేసి జోరుమీదున్న తరుణంలో ఔట్ కావడం సన్‌రైజర్స్‌ను దెబ్బతీసింది. చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి ఉండగా వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్ బ్యాటింగ్‌లో ఉండటంతో సన్‌రైజర్స్ గెలుపు ఖాయమని అనుకున్నారు. కానీ పేసర్ ముఖేష్ కుమార్ యార్కర్లతో విజృంభించడంతో సైన్‌రైజర్స్ ఐదు పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, నోర్జ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.