CSK vs GT: క్వాలిఫయర్‌లో గుజరాత్‌కు షాకిచ్చిన చెన్నై - ఫైనల్‌లో అడుగుపెట్టిన ధోనీసేన
CSK vs GT: తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.
CSK vs GT: ఐపీఎల్ 2023 ఫైనల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్ అడుగుపెట్టింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగులు తేడాతో విజయాన్ని సాధించింది. పదోసారి ఐపీఎల్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన చెన్నై చరిత్రను సృష్టించింది.
లీగ్ దశలో అద్భుత విజయాలతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్‌లో ఒత్తిడిని జయించలేక విజయం ముంగిట బోల్తాపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 172 రన్స్ చేసింది.
లక్ష్యఛేదనలో బ్యాట్స్‌మెన్స్ తడబడటంతో గుజరాత్ సరిగ్గా ఇరవై ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. చెన్నైని ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే కలిసి మరోసారి ఆదుకున్నారు. రుతురాజ్ హాఫ్ సెంచరీతో రాణించగా (44 బాల్స్‌లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్‌తో 60 రన్స్), కాన్వే 34 బాల్స్‌లో నాలుగు ఫోర్లతో 40 రన్స్ చేశాడు. తొలి వికెట్‌కు వీరిద్దరు పది ఓవర్లలోనే 80 పరుగులు జోడించడంతో చెన్నై భారీ స్కోరు చేసేలా కనిపించింది.
కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు చేయడంలో విఫలం కావడంతో చెన్నై 172 పరుగులు మాత్రమే చేసింది. జడేజా 22 రన్స్‌తో చివరలో బ్యాట్ ఝులిపించడంతో చెన్నై ఈ మాత్రమైనా స్కోరు చేయగలిగింది.
ధోనీ సింగిల్ రన్ మాత్రమే చేసి ఔటయ్యాడు. 173 పరుగులతో ఛేదనను మొదలుపెట్టిన గుజరాత్‌ను మరోసారి శుభ్‌మన్ గిల్ ఆదుకున్నాడు. 38 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 రన్స్ చేశాడు. కానీ హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్‌తో పాటు రాహుల్ తేవాతియా, శనక తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో గుజరాత్ ఓటమి ఖాయమైంది.
చివరలో రషీద్‌ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో (16 బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 రన్స్) గుజరాత్‌ను గెలిపించినంత పనిచేశాడు. కీలక సమయంలో అతడు ఔట్ కావడంతో గుజరాత్ పదిహేను పరుగులతో ఓటమి పాలైంది. చెన్నై బౌలర్లు సమిష్టిగా రాణించి కీలక సమయాల్లో వికెట్లు తీశారు. జడేజా, తీక్షణ, పతిరన, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
గుజరాత్‌కు మరో ఛాన్స్
క్వాలిఫయర్ వన్‌లో ఓటమి పాలైన గుజరాత్‌కు ఫైనల్ చేరుందుకు మరో అవకాశం ఉంది. నేడు లక్నో, ముంబై మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో గుజరాత్ తలపడనుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే గుజరాత్ ఫైనల్ చేరే అవకాశం ఉంది.