CSK vs GT: ఫైనల్ బెర్తు ఎవరిదో ? - నేడు చెన్నై, గుజరాత్ మధ్య క్వాలిఫయర్ మ్యాచ్
CSK vs GT: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటే...

CSK vs GT: ఐపీఎల్‌లో ఫైనల్ చేరే తొలి జట్టు ఏదన్నది నేడు తేలనుంది. మంగళవారం చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెడుతోంది. ఓడిన జట్టుకు కూడా ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.
గుజరాత్‌దే అధిపత్యం…
ఈ ఐపీఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ పదింటిలో విజయాన్ని సాధించింది. కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఓడింది. ఐపీఎల్‌లో చెన్నై, గుజరాత్ ఇప్పటివరకు మూడు సార్లు తలపడ్డాయి. ఈ మూడు మ్యాచుల్లో గుజరాత్ విజయాన్ని అందుకున్నది.
ఐపీఎల్ 2023 చెన్నై, గుజరాత్ మ్యాచ్‌తోనే మొదలైంది. ఆరంభ పోరులో కూడా చెన్నైని గుజరాత్ చిత్తు చేసింది. శుభ్‌మన్‌గిల్ సూపర్ ఫామ్‌లో ఉండటం గుజరాత్‌కు బ్యాటింగ్ పరంగా పెద్ద బలంగా మారింది. 14 మ్యాచుల్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 680 రన్స్ చేశాడు గిల్. విజయ్ శంకర్, అభివన్ మనోహర్, సాయిసుదర్శన్, డేవిడ్ మిల్లర్‌తో పాటు హార్దిక్ పాండ్య వంటి హిట్లర్లు జట్టులో ఉన్నారు.
బౌలింగ్ పరంగా షమీ, రషీద్‌ఖాన్ గుజరాత్‌కు వెన్నుముకగా నిలుస్తోన్నారు. వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తోన్నారు. సీనియర్ పేసర్ మోహిత్ శర్మతో పాటు యంగ్ స్పిన్సర్ నూర్ అహ్మద్ కూడా రాణిస్తోండటం గుజరాత్‌కు సానుకూలంశంగా మారింది.
చెన్నై జోరు కొనసాగేనా?
ఈ ఐపీఎల్‌ను ఓటమితో ప్రారంభించిన చెన్నై చివరలో వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. కెప్టెన్‌గా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావడంతో అతడి కోసమైనా కప్ కొట్టి ఘనంగా వీడ్కోలు పలకాలని చెన్నై టీమ్ భావిస్తోంది. చెన్నైకి బ్యాటింగ్ పరంగా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మెరుపు ఆరంభాల్ని అందిస్తోన్నారు.
క్వాలిఫయర్ మ్యాచ్‌లో వారిపైనే చెన్నై ఫ్యాన్స్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. రహానే, శివమ్ దూబే కూడా కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. వీరివల్లే చెన్నైప్లేఆఫ్స్ వరకు రాగలిగింది. బౌలింగ్‌లో యంగ్ పేసర్ తుషార్ దేశ్‌పాండే చెన్నైభారం మొత్తం ఉంది. పతిరన, మొయిన్ అలీ, జడేజా, తీక్షణ కూడా రాణిస్తేనే చెన్నై విజయాన్ని అందుకోగలదు.