Brett Lee on RCB: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీదే: బ్రెట్ లీ
Brett Lee on RCB: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీదే అని ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ అన్నాడు. వాళ్లు ప్రతి మ్యాచ్ కూ మెరుగవుతున్నట్లు అతడు చెప్పాడు.
Brett Lee on RCB: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరిది? ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ సమాధానం ఆర్సీబీ. గురువారం (మే 18) సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ తర్వాత ఆర్సీబీ గెలుస్తుందన్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెస్సి ఫామ్ చూసి బ్రెట్ లీ ఆశ్చర్యపోతున్నాడు. వాళ్లు ప్రతి మ్యాచ్ కూ మెరుగవుతున్నట్లు చెప్పాడు.
"వాళ్లు మెరగవుతూనే ఉన్నారు. ఆ ఇద్దరూ సరైన ఉద్దేశంతోనే వెళ్లారు. క్లాసెన్ ఏ గ్రేడ్ లో ఆడాడు. కానీ కోహ్లి అంతకు మించి బాదాడు. కోహ్లి ఆడిన కొన్ని షాట్లు మాటలకందవు. తానేంటో నిరూపించే ప్రయత్నం చేశాడు. క్రీజులో పెద్దగా కదల్లేదు.
అలాంటి షాట్లు ఆడుతున్నప్పుడు కోహ్లి ఊపుమీదున్నట్లు భావించాలి. ఫాఫ్ డుప్లెస్సి గురించి కూడా చెప్పుకోవాలి. కోహ్లికి చక్కని సహకారం అందించాడు. ఆర్సీబీ ఈ ఐపీఎల్ కు కీలకమైన మలుపు తీసుకొచ్చింది. వాళ్లు నా టాప్ 4లో ఉన్నారు. ఈ ఏడాది వాళ్లే ట్రోఫీ కూడా గెలవచ్చు" అని బ్రెట్ లీ అన్నాడు.
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో కోహ్లి, డుప్లెస్సి.. ఆర్సీబీకి 8 వికెట్ల విజయాన్ని అందించారు. ఇప్పుడు గుజరాత్ టైటన్స్ తో సొంతగడ్డపై జరగబోయే చివరి మ్యాచ్ లోనూ గెలిస్తే వాళ్ల ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయమవుతుంది. అటు మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కూడా ఆర్సీబీపై ప్రశంసలు కురిపించాడు.
"ఆర్సీబీ ఓడిపోవాలని అన్ని టీమ్స్ భావించాయి. అందుకే ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంది. గత సీజన్లలో ఒత్తిడిలో ఈ టీమ్ తలొగ్గడం చూశాం. అలా చూసినప్పుడు ఈ ఇన్నింగ్స్ మరింత స్పెషల్. అందులో అంతకుముందు క్లాసెన్ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే ఆ తర్వాత పిచ్ బ్యాటర్లకు అనుకూలించేలా కనిపించలేదు.
కానీ విరాట్ ఆడుతుంటే అలా అనిపించలేదు. తొలి రెండు ఓవర్లలోనే నాలుగైదు ఫోర్లు కొట్టాడు. ఏదో స్పెషల్ చూడబోతున్నామా అనిపించింది. అందుకు తగినట్లే స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు" అని జహీర్ చెప్పాడు.
సంబంధిత కథనం