Faf du Plessis on Kohli: కోహ్లి ప్రత్యర్థిగా ఉండటం కంటే అతడితో కలిసి ఆడటమే మంచిది: డుప్లెస్సి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis on Kohli: కోహ్లి ప్రత్యర్థిగా ఉండటం కంటే అతడితో కలిసి ఆడటమే మంచిది అంటూ డుప్లెస్సి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ గా డుప్లెస్సి.. విరాట్ కోహ్లితో కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే.
Faf du Plessis on Kohli: కోహ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి. అతని ప్రత్యర్థిగా ఉండటం కంటే అతనితో కలిసి ఆడటమే బెటరని అతడు అనడం విశేషం. కోహ్లికి క్రికెట్ పట్ల ఉన్న ప్యాషన్ తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందని అతడు చెప్పాడు. గతంలో సౌతాఫ్రికాకు ఆడే సమయంలో డుప్లెస్సి.. కోహ్లి ప్రత్యర్థిగా కూడా ఉన్నాడు.
దీంతో అతడు ఈ కామెంట్స్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆర్సీబీ తరఫున ఓపెనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. "విరాట్ గురించి చెప్పాలంటే అతని ప్యాషన్ నన్ను ఆశ్చర్యపరుస్తుంది. విరాట్ ప్రత్యర్థిగా ఆడిన క్షణాలు కూడా ఎప్పటికీ మరవను. వికెట్ పడిన ప్రతీసారీ అతని ఉత్సాహం ఎలా ఉంటుందో తెలుసు కదా.
11వ నంబర్ బ్యాటర్ ఔటైనా విరాట్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటాడు. అతడు ఆట పట్ల ఎప్పుడూ ఇంత మక్కువగా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు అతనితో కలిసి ఒకే టీమ్ లో ఉన్నాను కాబట్టి చెబుతున్నాను.. విరాట్ కు ప్రత్యర్థిగా ఉండటం కంటే అతనితో కలిసి ఆడటం చాలా బాగుంటుంది" అని డుప్లెస్సి అన్నాడు.
ఆట పట్ల అతనికి ఉన్న మక్కువ ఓ ప్రత్యర్థి ఆటగాడికి ఇంధనంగా పని చేస్తుందని చెప్పాడు. "కోహ్లి ప్రత్యర్థిగా ఆడుతున్నప్పుడు అతని ప్యాషన్ ప్రత్యర్థులకు ఇంధనంగా పని చేస్తుంది. నేనూ అది చూశాను. కానీ అతనితో కలిసి ఆడుతున్నప్పుడు అది మనకు పాకుతుంది.
కోహ్లితో కలిసి ఆడుతుంటే.. మన అత్యుత్తమ ఆట కనబరచాలని అనిపిస్తుంది. ఫీల్డ్ బయట కూడా అతడు చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మా ఇద్దరి ఆసక్తులు కూడా చాలా వరకూ ఒకేలా ఉంటాయి" అని డుప్లెస్సి అన్నాడు.