Virat Kohli on critics: నేను పట్టించుకోను.. ఎలా గెలవాలో నాకు తెలుసు: విమర్శలపై విరాట్ కోహ్లి
Virat Kohli on critics: నేను పట్టించుకోను.. ఎలా గెలవాలో నాకు తెలుసు అంటూ సెంచరీ తర్వాత తనపై వస్తున్న విమర్శలకు విరాట్ కోహ్లి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు.
Virat Kohli on critics: విరాట్ కోహ్లి తన విమర్శకులపై విరుచుకుపడ్డాడు. బయటి వాళ్లు ఏమన్నా తాను పట్టించుకోనని, ఎలా గెలవాలో తనకు తెలుసని అతడు అనడం విశేషం. ఐపీఎల్లో నాలుగేళ్ల తర్వాత సెంచరీతో ఆర్సీబీని గెలిపించిన తర్వాత కోహ్లి చాలా ఘాటుగా స్పందించాడు. ఈ సీజన్ ఐపీఎల్లో విరాట్ పరుగులు చేస్తున్నా.. స్ట్రైక్ రేట్ సరిగా లేదన్న విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
అతడు టీ20 క్రికెట్ కు పనికి రాడని కూడా విమర్శించిన వాళ్లు ఉన్నారు. వాళ్లందరికీ కోహ్లి తన సెంచరీతో సమాధానమిచ్చాడు. అందులోనూ చిత్రవిచిత్రమైన షాట్లతో కాకుండా తన మార్క్ పక్కా క్రికెట్ షాట్లతో కేవలం 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో 8 వికెట్లతో గెలిచిన ఆర్సీబీ.. తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది.
అతని దూకుడు ముందు 187 పరుగుల లక్ష్యం కూడా చాలా చిన్నదైపోయింది. ఈ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తనపై వస్తున్న విమర్శలపై కోహ్లి ఘాటుగా స్పందించాడు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ పై ఇంతవరకూ ఉన్న చెత్త రికార్డును తుడిపేశాడు. ఇక తానెప్పుడూ తన టెక్నిక్ నే నమ్ముకుంటానని, అందుకే ఫ్యాన్సీ షాట్లు ఆడలేదని కూడా చెప్పాడు.
"ఏదో కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడులే అన్నట్లు ఐపీఎల్లో నన్ను ఓ సాధారణ ప్లేయర్ గా చూశారని నేను టీమ్ ప్లేయర్స్ తో చెబుతుండేవాడిని. కానీ నాకు ఐపీఎల్లో ఇది ఆరో సెంచరీ.
నాకు నేను ఎప్పుడూ క్రెడిట్ ఇచ్చుకోను. గత రికార్డులను పట్టించుకోను. నేనిప్పటికే నన్ను నేను చాలా ఒత్తిడిలోకి నెట్టేసుకున్నాను. బయటి వాళ్లు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే అది వాళ్ల అభిప్రాయం. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా గెలిపించాలో నాకు తెలుసు. ఇప్పటికే నేను చాలాసార్లు ఆ పని చేశాను.
నా జట్టుకు విజయాలు అందించను అని కాదు. కానీ పరిస్థితికి తగినట్లు ఆడటమే నాకు ముఖ్యం. నేను ఫ్యాన్సీ షాట్లు ఆడి నా వికెట్ పారేసుకునే ప్లేయర్ ను కాదు. ఐపీఎల్ తర్వాత టెస్ట్ క్రికెట్ రాబోతోంది. నా టెక్నిక్ కు తగినట్లు ఆడటం అవసరం. ముఖ్యమైన మ్యాచ్ లో ఇలా ఆడటం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది" అని కోహ్లి అన్నాడు.
సంబంధిత కథనం