Virat Kohli: ఒకే ఒక్క రియల్ కింగ్ విరాట్ కోహ్లి.. పాకిస్థాన్ స్టార్ ప్రశంసల వర్షం
Virat Kohli: ఒకే ఒక్క రియల్ కింగ్ విరాట్ కోహ్లి అంటూ పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ ఆమిర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్లో గురువారం (మే 18) సన్ రైజర్స్ తో మ్యాచ్ లో అతడు కళ్లు చెదిరే సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Virat Kohli: ఐపీఎల్లో నాలుగేళ్ల తర్వాత సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎంతో మంది మాజీ క్రికెటర్లు ట్విటర్ ద్వారా కోహ్లిని ఆకాశానికెత్తుతున్నారు. అయితే పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ ప్రశంస మాత్రం ఇందులో ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మ్యాచ్ తర్వాత గురువారం అర్ధరాత్రి ఆమిర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
ముఖ్యంగా పాకిస్థాన్ కే చెందిన బాబర్ ఆజంను కోహ్లితో పోలుస్తూ ఎవరు బెస్ట్ ప్లేయర్ అని పోల్చి చూస్తున్న వేళ పాకిస్థాన్ కు చెందిన ప్లేయర్ నుంచే ఇలాంటి ప్రశంస రావడం నిజంగా గొప్ప విషయమే. "వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి. టేక్ ఎ బో" అంటూ మహ్మద్ ఆమిర్ ట్వీట్ చేశాడు. అటు టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ కూడా కోహ్లిని మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు.
"కింగ్ కోసం అందరూ లేచి నిల్చోండి. అద్భుతమైన ఇన్నింగ్స్. చూడముచ్చటగా ఉంది" అని యువీ ట్వీట్ చేశాడు. అటు సచిన్ స్పందిస్తూ.. "తొలి బంతికే విరాట్ ఆ కవర్ డ్రైవ్ ఆడటం చూసిన తర్వాత ఇవాళ అతడు చెలరేగుతాడని అనిపించింది. విరాట్, ఫాఫ్ ఇద్దరూ పూర్తి నియంత్రణలో కనిపించారు. భారీ షాట్లు ఆడటంతోపాటు వికెట్ల మధ్య చురుగ్గా పరుగెత్తుతూ విజయవంతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ ఇద్దరి జోరుతో 186 పరుగుల లక్ష్యం కూడా సరిపోలేదు" అని సచిన్ ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్ లో కోహ్లి 62 బంతుల్లోనే సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో అతనికిది 6వ సెంచరీ. దీంతో క్రిస్ గేల్ అత్యధిక సెంచరీల రికార్డును కూడా సమం చేశాడు. ఇందులో 103 మీటర్ల దూరం బాదిన సిక్స్ కూడా ఉంది. అతని షాట్లు అవతలి వైపు బ్యాటింగ్ చేస్తున్న ఫాఫ్ డుప్లెస్సిని కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. కోహ్లి బ్యాటింగ్ ను హైదరాబాద్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. దాదాపు స్టేడియంలోని ప్రేక్షకులంతా మొత్తం ఆర్సీబీ జట్టుకే సపోర్ట్ చేయడం విశేషం.
సంబంధిత కథనం