Ravi Shastri on Hardik: టీమిండియా టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ను కొనసాగించాలి.. రవిశాస్త్రీ షాకింగ్ కామెంట్స్-hardik pandya should continue as india t20i captain ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri On Hardik: టీమిండియా టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ను కొనసాగించాలి.. రవిశాస్త్రీ షాకింగ్ కామెంట్స్

Ravi Shastri on Hardik: టీమిండియా టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ను కొనసాగించాలి.. రవిశాస్త్రీ షాకింగ్ కామెంట్స్

Maragani Govardhan HT Telugu
May 12, 2023 08:21 PM IST

Ravi Shastri on Hardik: టీమిండియా టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే కొనసాగించాలని మాజీ కోచ్ రవిశాస్త్రీ అన్నారు. సెలక్టర్లు కూడా ఇదే విషయంపై ఆలోచిస్తున్నారని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.

హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య (AFP)

Ravi Shastri on Hardik: హార్దిక్ పాండ్య ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ జట్టుకు దూరమైనప్పుడల్లా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సారథ్యం వహిస్తూ తన సత్తా ఏంటో చాటుతున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో హార్దిక్ కెప్టెన్సీలో టీమిండియా దూసుకెళ్తోంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ పరాజయం చెందినప్పటి నుంచి హార్దిక్ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టీ20లకు హార్దిక్‌నే కెప్టెన్‌గా నియమించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ కూడా తెలిపారు. సెలక్టర్లు కూడా ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హార్దిక్‌ను పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా నియమిస్తారని తను అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

"అతడు(హార్దిక్ పాండ్య) ఇప్పటికే భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఫిట్‌గా ఉన్నంత కాలం అతడే కెప్టెన్‌గా కొనసాగాలి. సెలక్టర్లు కూడా ఇదే విషయం ఆలోచిస్తున్నారనుకుంటా. ప్రస్తుతం యువకుల్లో చాల మంది ప్రతిభావంతులున్నారు. కాబట్టి కొత్త జట్టును తీసుకురావచ్చు. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న యువ ప్రతిభావంతులను చూస్తున్నారు. కాబట్టి బీసీసీఐ 2007లో అనుసరించిన మార్గంలోనే వెళ్తుందని అనుకుంటున్నా. అప్పుడు కూడా యువకులకు అవకాశం కల్పించారు. పాండ్య ప్రతిభ కలిగిన ఆటగాడు. అతడి ఐడియాలు విభిన్నంగా ఉంటాయి. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఇతర ఆటగాళ్లను కూడా గమనిస్తున్నాడు." అని రవిశాస్త్రీ అన్నారు.

ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ముగిసేంత వరకు తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్‌ గురించి ఆలోచించవద్దని రవిశాస్త్రీ అన్నారు. "అక్టోబరు-నవంబరులో జరగనున్న ఐసీసీ ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న తరుణంలో అతడు టెస్టు జట్టులో లేనందుకు అతడిపై ఎలాంటి వర్క్ లోడ్ ఉండదు. ఈ రోజుల్లో ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడట్లేదు. టెస్టు సిరీస్ సమయంలో అతడికి ఓ నెల విశ్రాంతి దొరుకుతుంది." అని రవిశాస్త్రీ అన్నారు.

గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ నుంచి పొట్టి ఫార్మాట్‌కు హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 8 టీ20లు జరిగితే హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడినే కొనసాగించాలనే వాదనలు పెరుగుతున్నాయి.

Whats_app_banner