Amit Mishra counter to Shahid Afridi: కోహ్లీ రిటైర్మెంట్‌పై మాట్లాడినందుకు..అఫ్రిదీకు అమిత్ మిశ్రా కౌంటర్.. ట్వీట్ వైరల్-amit mishra counter on shahid afridi who has suggested to virat kohli for retirement ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Amit Mishra Counter To Shahid Afridi: కోహ్లీ రిటైర్మెంట్‌పై మాట్లాడినందుకు..అఫ్రిదీకు అమిత్ మిశ్రా కౌంటర్.. ట్వీట్ వైరల్

Amit Mishra counter to Shahid Afridi: కోహ్లీ రిటైర్మెంట్‌పై మాట్లాడినందుకు..అఫ్రిదీకు అమిత్ మిశ్రా కౌంటర్.. ట్వీట్ వైరల్

Maragani Govardhan HT Telugu
Sep 14, 2022 01:11 PM IST

Amit Mishra Tweet About Afridi: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించిన అఫ్రిదీపై టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

<p>షాహిద్ అఫ్రిదీ-విరాట్ కోహ్లీ</p>
షాహిద్ అఫ్రిదీ-విరాట్ కోహ్లీ (HT)

Amit Mishra Tweet on Shahid Afridi: విరాట్ కోహ్లీ ఫామ్ గురించి గత కొంత కాలంగా యావత్ క్రికెట్ సమాజమంతా చర్చిస్తూనే ఉంది. అతడిలో మునుపటి దూకుడు తగ్గిందని, ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడని రకరకాల మాటలు వినిపించాయి. అయితే ఈ నోళ్లన్నింటినీ ఒక్క ఇన్నింగ్స్‌తో మూసిపెట్టాడు మన రన్నింగ్ మెషిన్. ఆఫ్గానిస్థాన్‌తో గత వారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో అదిరిపోయే శతకంతో తానేంటో నిరూపించాడు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఫామ్ గురించి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ తను ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాలని ఉచిత సలహా ఇచ్చాడు.

yearly horoscope entry point

"కోహ్లీ తన కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తనకు ప్రస్తుతమున్న గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎన్నో ఎత్తు పల్లాలను చూశాడు. అతడు ఛాంపియన్‌లా ఎదిగాడు. ప్రస్తుతం అతడు రిటైర్మెంట్ దిశగా వెళ్లాలని నేను అనుకుంటున్నాను. కెరీర్‌ ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడే వైదొలిగితే మంచిది. ఎందుకంటే జట్టు నుంచి తొలగించేంత వరకు తెచ్చుకోకూడదు. బదులుగా కెరీర్‌లో శిఖరాగ్రంలో ఉన్నప్పుడే వైదొలగాలి. అయితే ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. అందులోనూ అతికొద్దిమంది ఆటగాళ్లు మాత్రమే ఆసియా కప్ టోర్నీ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారు. కానీ కోహ్లీ అలా చేస్తాడనుకోవడం లేదు. తనదైన శైలిలో తన కెరీర్ ప్రారంభం ఎలా అయితే ఉందో అలాగే ముగిస్తాడని అనుకుంటున్నా." అని విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి సంచనల వ్యాఖ్యలు చేశాడు అఫ్రిదీ.

అఫ్రిదీ అభిప్రాయం ప్రకారం కోహ్లీ రిటైర్మెంట్‌కు టైమ్ వచ్చిందని ప్రత్యక్షంగా చెప్పకనే చెప్పాడు. దీంతో టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా తనదైన శైలిలో అఫ్రిదీపై స్పందించాడు. "డియర్ అఫ్రిదీ కొంతమంది కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే రిటైర్ అవుతారు. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యాఖ్యల నుంచి కోహ్లీకి మినహాయింపు ఇవ్వడం మంచిది" అంటూ అఫ్రిదీకి కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం అమిత్ మిశ్రా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందించారు.

అమిత్ మిశ్రా పరోక్షంగా షాహిద్ అఫ్రిదీ కెరీర్‌పై సెటైర్ వేశాడు. అఫ్రిదీ తన కెరీర్‌లో చాలా సార్లు రిటైర్మెంట్ ప్రకటించి.. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అతడు తొలిసారి 2006లో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆ నిర్ణయాన్ని తర్వాతి రెండు వారాల్లోనే వెనక్కి తీసుకున్నాడు. అనంతరం 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పాక్ కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కెప్టెన్‌గా వ్యవహరించిన అఫ్రిదీ ఆ ఈవెంట్ తర్వాత అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు స్పష్టం చేశాడు. అయితే పాక్ క్రికెట్ బోర్డు ఒత్తిడితో ఆ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకున్నాడు. ఫలితంగా 2015 ప్రపంచకప్ వరకు కొనసాగాడు. ఎట్టకేలకు 2017లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం