Nimmakaya deepam: నిమ్మకాయ దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వల్ల కలిగే ఫలితాలు ఏంటి?
Nimmakaya deepam: అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు చాలా మంది నిమ్మకాయ దీపం వెలిగిస్తారు. అసలు ఈ దీపం ఎందుకు వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంతో తెలుసుకుందాం.
Nimmakaya deepam: ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడి ముందు దీపం వెలిగిస్తారు. చాలామంది తమ జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోవడం కోసం నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు. అయితే నిమ్మకాయ దీపం ఎప్పుడంటే అప్పుడు వెలిగించకూడదు. ఈ దీపం వెలిగించడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూజా విధానం సరిగా తెలుసుకొని ఈ దీపం వెలిగించాలి.
నిమ్మకాయ దీపం ఎందుకు వెలిగిస్తారు?
కుజదోషం, కాలసర్ప దోషం, వ్యాపార, కుటుంబ, ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. శక్తి స్వరూపిణిగా భావించే అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఈ నిమ్మకాయ దీపం వెలిగిస్తారు. పార్వతి దేవికి నిమ్మకాయ దీపం అంటే మహా ప్రీతి. అమ్మవారి అనుగ్రహం కోసం ఈ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు.
నిమ్మకాయలు పార్వతీదేవి స్వరూపిణిగా భావిస్తారు. గ్రామదేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, పెద్దమ్మ మొదలైన శక్తి దేవి అవతారాలకు నిమ్మకాయలతో చేసిన దండలు సమర్పిస్తారు. అయితే ఈ దీపాలను ఎక్కడంటే అక్కడ వెలిగించకూడదు. నిమ్మకాయ దీపాలను గ్రామదేవతల ఆలయాల్లో మాత్రమే వెలిగించాలి. మహాలక్ష్మి, సరస్వతి, ఇతర దేవాలయాలలో ఈ దీపాలను వెలిగించకూడదు.
ఎప్పుడు వెలిగించాలి?
నిమ్మకాయ దీపాలను వెలిగించేందుకు వారంలో రెండు రోజులు చాలా ముఖ్యమైనవి. మంగళ, శుక్రవారాలలో రాహుకాల సమయంలో మాత్రమే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. శుక్రవారం రోజు వెలిగించే దీపానికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం సత్వగుణానికి ప్రతీకగా భావిస్తారు. మంగళవారం రజోగుణానికి ప్రత్యేకంగా చెప్తారు. అందుకే శుక్రవారం దీపానికి ప్రాముఖ్యత ఎక్కువ.
దీపారాధన నియమాలు
దీపం వెలిగించడం కోసం ముందుగా మచ్చలు లేని తాజాగా, పచ్చగా ఉండే నిమ్మకాయలు ఉపయోగించాలి. దీపం కింద తమలపాకు లేదా ధాన్యం పోసి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత నిమ్మకాయ దీపం పెట్టాలి. ఈ పూజలో ఎరుపు రంగు పూలు ఉపయోగించాలి. నిమ్మకాయ దీపం వెలిగించినప్పుడు బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందుతారు.
ఎప్పుడు వెలిగించకూడదు
నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మచ్చలు లేని వాడిపోని ఆకుపచ్చని రంగులో ఉన్న నిమ్మకాయలు మాత్రమే ఈ దీపం వెలిగించేందుకు ఉపయోగించాలి. అలాగే బహిష్టు సమయంలో ఉన్నప్పుడు దీపాలు వెలిగించకూడదు. రుతుక్రమం ముగిసిన తర్వాత నాలుగో రోజు తలస్నానం చేసి ఐదో రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే నిమ్మకాయ దీపం వెలిగించాలి. పండుగల సమయంలో, పెద్దల తిథి కార్యాలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి సమయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు.
మీరు ఉంటున్న ఊరి పరిధిలో మాత్రమే ఈ దీపం వెలిగించాలి. వేరే ఊర్లో, స్నేహితులు, బంధువుల ఆడపిల్లలు, అక్క చెల్లెలు, ఆడబిడ్డల ఇళ్లలో వాళ్ళ అనుమతి తీసుకోకుండా నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. అలాగే నిమ్మకాయ దీపం వెలిగించినప్పుడు మరొక దీపం పెట్టకూడదు. దీపం వెలిగించేటప్పుడు స్త్రీలు పట్టుచీర ధరిస్తే అమ్మవారి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి. ఆధునిక దుస్తులు పొరపాటున కూడా ధరించి నిమ్మకాయ దీపం వెలిగించకూడదు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రతిఫలం మీకు ఉండకపోవచ్చు.
ఇతర దేవాలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల ఆర్థిక నష్టం సంభవిస్తుంది. అకాల మృత్యువు సంభవిస్తుందని చెప్తారు. స్నేహితులు బంధువుల మధ్య తగాదాలు జరుగుతాయి. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు మహిళలు కూడా నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీపాన్ని ఇంట్లో మాత్రం వెలిగించకూడదు.
శుభ్రంగా నియమ నిష్టలతో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వల్ల పార్వతీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. నిమ్మకాయ దీపం భక్తితో వెలిగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.