Akshaya tritiya 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏంటి? ఎందుకంత పవిత్రమైనది
Akshaya tritiya 2024: అక్షయ తృతీయ అంటే ఏంటి? ఎందుకంత పవిత్రమైనదిగా భావిస్తారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పండుగకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనే దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
Akshaya tritiya 2024: చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 10 మే 2024 వైశాఖ మాస శుక్ష పక్ష తదియ అక్షయ తృతీయ ఏర్పడినదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత?
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కృతయుగం ప్రారంభమైన రోజు అక్షయ తృతీయ అని చిలకమర్తి తెలిపారు. పరశురాముడు జన్మించినటువంటి రోజు అక్షయ తృతీయ రోజు. గంగా నది భూమిని తాకిన రోజు అక్షయ తృతీయ రోజు. మహాభారతాన్ని వ్యాసులవారు ప్రారంభించిన రోజు అక్షయ తృతీయ నాడే.
మహాభారతంలో పాండవులకు సూర్యభగవానుడు దర్శనమిచ్చి అక్షయపాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే. కలియుగంలో ఆదిశంకరాచార్యులవారు కనకధారా స్తోత్రమును చెప్పిన రోజు అక్షయ తృతీయగా చిలకమర్తి తెలిపారు.
శుభ ముహూర్తాలు ఏవంటే?
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సంవత్సరంలో మూడున్నర ముఖ్య ముహూర్తాలున్నాయి. ఈ మూడున్నర ముఖ్య ముహూర్తాలు ఉన్న రోజుల్లో ఏ పనీ ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుందని శాస్త్రం చెబుతుందని చిలకమర్తి తెలిపారు. ఆ మూడున్నర ముహూర్తాల రోజులలో మొట్టమొదటి రోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి ఉగాది ఒకటి.
వైశాఖ మాస శుక్లపక్ష తదియ అక్షయ తృతీయ రెండవ రోజు. ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష దశమి విజయదశమి మూడవ రోజు. దీపావళి ముందు రోజు అయిన నరక చతుర్దశి సాయంత్ర కాలంలో ఉన్న అర పూట మంచి ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ మూడు + అర కలిపి మూడున్నర రోజులు దివ్యమైన రోజులుగా చెప్పబడినవని చిలకమర్తి తెలిపారు.
ఈ మూడున్నర రోజులలో ఏ పని ప్రారంభించినా విజయవంతముగా శుభఫలితాలు ఇస్తాయని చిలకమర్తి తెలిపారు. అక్షయ తృతీయ రోజు ఏదైన శుభ కార్యమనగా విద్యార్థులు విద్య పరమైనటువంటి కార్యక్రమాలు, వ్యాపారులు వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, గృహస్తులు గృహానికి వస్తువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అలాగే భగవత్ భక్తులు, సన్యాసులు ఈ రోజు చేసేటటువంటి అధ్యాత్మిక కార్యక్రమాలు అక్షయమైనటువంటి ఫలితాలు ఇస్తాయని శాస్త్రము.
అక్షయ తృతీయ రోజు ఎవరైతే వ్రతాలు, హోమాలు, దానాలు వంటివి ఆచరిస్తారో వారికి అక్షయమైనటువంటి ఫలితము లభిస్తుందని చిలకమర్తి తెలిపారు. శుక్రవారం రోజు అక్షయ తృతీయ రావడం విశేషం. శంకరాచార్యుల వారిచే కనకాధారా సోత్రం చెప్పబడిన రోజు అక్షయ తృతీయ రోజు.
శుక్రవారంతో కూడిన రోజు అక్షయ తృతీయ రావటంచేత ఈ రోజు కనకాధారా స్తోత్రాన్ని చదువుకున్న వారికి, లక్ష్మీదేవిని పూజించుకున్న వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.