Buy gold this Diwali: ఈ దీపావళికి గోల్డ్ కొంటున్నారా?.. ఈ టిప్స్ తో డబ్బు ఆదా చేసుకోండి..
Buy gold this Diwali: ఈ దీపావళికి గోల్డ్ కొనే ఆలోచనలో ఉంటే.. ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి. బంగారం కొనే ముందు ఈ విషయాలు తెలుసుకుంటే డబ్బు ఆదా అవుతుంది.
Buy gold this Diwali: సాధారణంగా మహిళలు దీపావళి సమయంలో, అక్షయ తృతియ సమయంలో బంగారం కొనడం చేస్తుంటారు. ఆ సమయాల్లో గోల్డ్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఈ సంవత్సరం బంగారం ధర 8% నుంచి 10% వరకు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో దీపావళి పండుగ వస్తోంది. దీపావళి సందర్భంగా గోల్డ్ కొనాలనుకుంటే.. ఈ టిప్స్ ద్వారా బెస్ట్ డీల్ పొందండి.
బంగారం ధరల్లో మార్పు
సాధారణంగా బంగారం ధర నిరంతరం మారుతూ ఉంటుంది. ఒక్క రోజులో పలుమార్లు ధరలో మార్పులు చోటు చేసుకుంటాయి. వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. గత నెలలో భారీగా బంగారం ధర తగ్గింది. మళ్లీ క్రమంగా పెరుగుతోంది. అందువల్ల పండుగ సీజన్ అని కాకుండా, ధర తక్కువగా ఉన్న సమయంలో బంగారాన్ని కొని పెట్టుకోవడం మంచిది.
తయారీ ఖర్చు..
సాధారణంగా నగల వ్యాపారులు ఆభరణం ధరలో తయారీ ఖర్చును కూడా చేర్చి చెబుతారు. ఈ మేకింగ్ చార్జ్ వివిధ రకాలుగా లెక్కగడ్తారు. జనరల్ గా బంగారం ధరపై కొంత శాతం మేకింగ్ చార్జిగా నిర్ణయిస్తారు. లేదా ఆభరణం ధరపై కొంత శాతాన్ని మేకింగ్ చార్జిగా నిర్ణయిస్తారు. డిజైన్ ను బట్టి కూడా మేకింగ్ చార్జిలో తేడా ఉంటుంది. ఉదాహరణకు.. 10 గ్రాముల బంగారం ఆభరణం ధర రూ. 60 వేలుగా ఉంటే, నగల వర్తకుడు ఆ ఆభరణం తయారీ ఖర్చును ఏకమొత్తంగా గ్రాముకు రూ. 300 గా నిర్ణయిస్తే, ఆ ఆభరణం తయారీ ఖర్చు రూ. 3000 అవుతుంది. అలా కాకుండా, ఆభరణం ధరపై 12% తయారీ ఖర్చు అని చెబితే.. రూ. 60 వేల ధర ఉన్న ఆ నగ మేకింగ్ చార్జి ఏకంగా రూ. 7,200 అవుతుంది. అందువల్ల, తయారీ దారు మేకింగ్ చార్జ్ ను ఎలా కాలిక్యులేట్ చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోవాలి.
బేరం ఆడండి..
చాలా జ్యువెలర్స్ ఫిక్స్ డ్ ప్రైస్ అని చెబుతారు. కానీ, కస్టమర్ కోరితే మేకింగ్ చార్జిపై కొంత మేరకు డిస్కౌంట్ ఇస్తారు. అందువల్ల మొహమాటపడకుండా మేకింగ్ చార్జిని తగ్గించమని కోరండి. పెద్దగా డిజైన్ లేని ఆభరణాలకు, మెషీన్ తో తయారు చేసే నగలకు మేకింగ్ ఖర్చు తక్కువగా ఉండాలి. కానీ కొందరు జ్యువెలర్స్ వాటికి కూడా పెద్ద మొత్తంలో మేకింగ్ చార్జీలను వసూలు చేస్తారు. ఆ విషయాన్ని గమనించి, వారిని ఈ విషయంపై ప్రశ్నించవచ్చు. వాటిపై మేకింగ్ చార్జీలను తగ్గించమని అడగవచ్చు.
వేర్వేరు షాపుల్లో పరిశీలించండి..
గోల్డ్ కొనేముందు హడావుడిగా ఒకే షాపులో వెంటనే కొనుగోలు చేయకండి. వేర్వేరు షాపుల్లో ఎంక్వైరీ చేయండి. సాధారణంగా మేకింగ్ చార్జెస్ 6% నుంచి 20% వరకు ఉంటాయి. తక్కువ తయారీ ఖర్చును వసూలు చేసే వారిని గుర్తించండి. అలాగే, పెద్ద పెద్ద బ్రాండెడ్ షో రూమ్ ల్లో కన్నా.. తెలిసిన, నమ్మకమైన, చిన్నతరహా వ్యాపారి వద్ద ధర కొంత తక్కువ ఉంటుంది. మనం మనకు నచ్చిన డిజైన్ చూపించి, సొంతంగా తయారు చేయించుకోవచ్చు. మేకింగ్ చార్జీ కూడా తక్కువే ఉంటుంది.